మెదడు చిత్రాల గుట్టు తెలిసింది!

ఒక ప్రదేశాన్ని మనం కళ్లతో ఒకేసారి కాకుండా.. కొద్దికొద్దిగా దృష్టి సారిస్తూ చూసినా.. 360 డిగ్రీల కోణంలో ఆ మొత్తం ప్రదేశ చిత్రపటం మన మెదడులో రూపుదిద్దుకుంటుంది. అయితే ఇదెలా సాధ్యం అవుతోందన్న విషయాన్ని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పరిశోధనలో భాగంగా కొంతమంది వాలంటీర్లను కొన్ని వీధుల గుండా నడిపించారు. తర్వాత ఆ వీధుల ఫొటోలను భాగాలుగా విడగొట్టి చూపించారు. దీంతో ఆయా భాగాలను చూసినప్పుడు వారిలో ఆ వీధి చిత్రపటం మొత్తంగా మెదిలింది. ఈ సమయంలో మెదడులోని మార్పులను పరిశీలించగా.. మెదడు వెనక ఉండే ఆసిపిటల్‌ ప్లేస్‌ ఏరియా(ఓపీఏ), రిట్రోస్పేనియల్‌ కార్టెక్స్‌(ఆర్‌ఎ్‌ససీ) భాగాలు క్రియాశీలం అయ్యాయి. దీంతో ఈ రెండు భాగాల వల్లే మెదడులో పనోరమిక్‌(నాలుగు దిక్కుల) దృశ్యాలు నిక్షిప్తం అవుతున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.