సర్జరీ లేకుండానే బ్రెయిన్‌ ట్యూమర్స్‌ మాయం

ఆంధ్రజ్యోతి,10-11-13:బ్రెయిన్‌ ట్యూమర్‌కు సర్జరీ తప్ప గత్యంతరం లేదంటారు వైద్యులు. సర్జరీ చేస్తే కాలు, చేయి పడిపోతాయేమోననేభయం రోగులది. నిజంగానే మెదడులో కణుతులు తొలగించడానికి చేసే సర్జరీలు రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. అయితే అదంతా గతం. ఇప్పుడు బ్రెయిన్‌ ట్యూమర్స్‌కు సర్జరీ అవసరం లేదు. తలపై కోత అక్కర్లేదు.రక్తం చుక్క చిందాల్సిన పనిలేదు. ఆసుపత్రిలో, ఐసీయూలో ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలా వచ్చి ఇలా చికిత్స తీసుకుని వెళ్లిపోవచ్చు. స్టీరియో టాక్టిక్‌ రేడియో సర్జరీగా పిలిచే ఈ చికిత్స బ్రెయిన్‌ ట్యూమర్స్‌తో బాధపడుతున్న వారికి ఒక వరంగా చెప్పుకోవచ్చని అంటున్నారు సీనియర్‌ న్యూరో అండ్‌ స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ రవి సుమన్‌ రెడ్డి.
 
మెదడులో కణితికి ఆపరేషన్‌ అంటే ఎంతటి వారికైనా వెన్నులో వణుకు పుడుతుంది. నిజంగానే  మెదడులో ఏర్పడే కణుతులను తొలగించాలంటే ఆపరేషన్‌ తప్ప గత్యంతరం ఉండేది కాదు. మెదడులోని రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలకు ఆపరేషన్‌ తప్పేది కాదు. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సతో సర్జరీ చేయాల్సిన అవసరం తప్పింది. 
సాధారణంగా మెదడులో ఏర్పడే కణుతుల్లో కేన్సర్‌ కాని కణుతులే ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాటిలో మెనింజోమా, పిట్యూటరీ ఎడినోమా, క్రానియోఫెరింజోమా, చెవి నరం పైన ఏర్పడే కణుతులు ముఖ్యమైనవి. ఇవి మెదడులో ఏర్పడే కణుతులే అయినా వీటికి చికిత్స అందిస్తే ఎటువంటి సమస్యా లేకుండా జీవితం గడిపే అవకాశం ఉంటుంది. రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలకు కూడా ఇదే విధంగా చికిత్స అందిస్తే ఆరోగ్య సమస్యలు లేకుండా జీవితం సాగించవచ్చు. ఈ సమస్యలకు గతంలో సర్జరీ చేయాల్సి వచ్చేది. వారం పది రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉండేది. రక్తం ఎక్కించాల్సి వచ్చేది. క్లిష్టమైన సర్జరీ కాబట్టి రిస్క్‌ ఎక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయాలేమీ లేకుండా పోయాయి. 

స్టీరియో టాక్టిక్‌ రేడియో సర్జరీ

సాధారణంగా రేడియేషన్‌ చికిత్సను కేన్సర్‌ చికిత్సలో భాగంగా వాడుతుంటారు. ఇదే చికిత్సను ప్రత్యేకమైన పరికరాల ద్వారా మెదడులో ఏర్పడే కణుతులకు అందించవచ్చు. దీన్నే స్టీరియో టాక్టిక్‌ రేడియో సర్జరీ అంటారు. ఇక్కడ రేడియేషన్‌ను కేన్సర్‌ కాని కణుతులకు చికిత్సగా ఉపయోగించడం జరుగుతుంది. ముందుగా కణితి ఉన్న ప్రదేశాన్ని స్కానింగ్‌ తీసి గుర్తించడం జరుగుతుంది. ఇందుకోసం తలకు ఫ్రేమ్‌ పెట్టడం జరిగేది. ట్యూమర్‌ ఎంత సైజులో ఉంది, నరాలు ఎక్కడ ఉన్నాయి, ముఖ్యమైన నిర్మాణాలు ఎలా ఉన్నాయనేది ఫ్రేమ్‌ అమర్చి పరిశీలించేవాళ్లు. తరువాత ఇదే ఫ్రేమ్‌తోనే కంప్యూటర్‌ సహాయంతో రేడియేషన్‌ చికిత్సను అందించేవాళ్లు. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. తలకు ఒక మాస్క్‌లాంటిది ధరింపజేసి స్కాన్‌ చేయడం జరుగుతోంది. అందుకే ఈ చికిత్సను ఫ్రేమ్‌లెస్‌ స్టీరియోటాక్టిక్‌ రేడియో సర్జరీ అని కూడా పిలుస్తుంటారు. స్కాన్‌ చేసి కణితి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి ఆ ప్రదేశంలోనే రేడియేషన్‌ ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన కణాలపై ఎటువంటి ప్రభావమూ ఉండదు. సాధారణంగా రేడియేషన్‌ చికిత్స ఒకే మార్గంలో, ఒకే డోస్‌లో అందిస్తే మెదడులో డ్యామేజ్‌ జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా, కణితిపైకి వేరు వేరు మార్గాల ద్వారా తక్కువ డోస్‌లో టార్గెట్‌ను చేరే విధంగా చికిత్స అందిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. స్టీరియో టాక్టిక్‌ రేడియో సర్జరీలో అదే విధంగా చికిత్స అందించడం జరుగుతుంది. దీనివల్ల కణితిపై రేడియేషన్‌ ప్రభావం తాలూకు కచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. మెదడులో ఏమాత్రం డ్యామేజ్‌ ఉండదు. సింగిల్‌ డోస్‌లో చికిత్స పూర్తవుతుంది. 3 సెంమీలకన్నా తక్కువ ఉన్న ట్యూమర్స్‌కు రేడియో సర్జరీతో ఉపయోగం ఉంటుంది. ఒకవేళ కణితి అంతకన్నా ఎక్కువ సైజులో ఉంటే స్టీరియోటాక్టిక్‌ రేడియోథెరపీ అందించాల్సి ఉంటుంది. అంటే ఒకటి కన్నా ఎక్కువ సార్లు రేడియేషన్‌ చికిత్స అందించాల్సి వస్తుంది. 

లాభాలెన్నో...

ఈ రేడియో సర్జరీ చేయడానికి రోగికి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్లడ్‌లాస్‌ ఉండదు. ఆసుపత్రిలో అడ్మిట్‌ కానవసరం లేదు. డే కేర్‌లో చికిత్స తీసుకుని వెళ్లిపోవచ్చు. ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఏ మాత్రం ఉండదు. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. రిస్క్‌ ఒక్కశాతం కూడా ఉండదు. మెదడులో ఏర్పడే కణుతులే కాకుండా ట్రైజెమినల్‌ న్యూరాల్జియా, పార్కిన్‌సన్స్‌ సమస్యలకు ఈ రేడియో సర్జరీ బాగా ఉపయోగపడుతుంది. ట్రైజెమినల్‌ న్యూరాల్జియాతో బాధపడుతున్న వారు సర్జరీ లేకుండా రేడియో సర్జరీతో అద్భుతమైన ఫలితం  పొందవచ్చు. ఏ మాత్రం రిస్క్‌ ఉండదు. ఎపిలెప్సికి కూడా ఈ చికిత్స ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఆపరేషన్‌ చేయడం సాధ్యపడటం లేదో అటువంటి వారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. బ్రెయిన్‌ ట్యూమర్‌ అనగానే భయపడిపోకుండా వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకుంటే సర్జరీ లేకుండా నయమయ్యే అవకాశాలు ఉంటాయి. 
డాక్టర్‌ రవిసుమన్‌ రెడ్డి
న్యూరో అండ్‌ స్పైన్‌ సర్జన్‌
అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌ స్టీరియో టాక్టిక్‌ రేడియో సర్జరీ (జర్మనీ)
యశోద హాస్పిటల్స్‌
మలక్‌పేట్‌, హైదరాబాద్‌
ఫోన్‌ : 98499 88642