బ్రెయిన్‌ స్ట్రోక్‌...మామూలు జీవితం సాధ్యమే!

30-10-2017: ఆధునిక సమాజం మరో ప్రమాదంలో ఉంది.. ఆ ప్రమాదం పేరే ‘బ్రెయిన్‌ స్ట్రోక్‌’...పేరుకు తగ్గట్టే ఈ బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఒక్కసారి వచ్చిందంటే లైఫ్‌ ఒక్కసారిగా రివర్స్‌ అవుతుంది. 50 ఏళ్లు దాటిన ప్రతి అయిదుగురు మహిళల్లో ఒకరికి, ప్రతి ఆరుగురు పురుషుల్లో ఒకరికి ఈ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య గణాంకాల సారాంశం. కానీ సరైన చికిత్సతో, మనో నిబ్బరంతో ఈ స్ట్రోక్‌ను తట్టుకొని తిరిగి సాధారణ జీవితాన్ని గడుపుతున్న వాళ్లూ ఉన్నారు.

అసలు ఇంతకీ బ్రెయిన్‌ స్ట్రోక్‌ అంటే ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు ఎదురయ్యే సమస్య ‘బ్రెయిన్‌ స్ట్రోక్‌’. మరో మాటలో చెప్పాలంటే...పక్షవాతం. ఎవరికైనా రావచ్చు. దీనికి వయోభేదం లేదు. ఈ స్ట్రోక్‌ ఒక్కోసారి మరణానికి దారి తీయడమో లేక ఆ వ్యక్తి పూర్తిగా అంగవైకల్యానికి గురి కావడమో జరుగుతుంది. 2030 నాటికి ఈ స్ట్రోక్‌ బారిన పడేవాళ్ల సంఖ్య రెండింతలు అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ఈ మధ్య ఈ స్ట్రోక్‌కు గురైన వాళ్లలో 19 ఏళ్ల వయసు వాళ్లు కూడా ఉంటున్నారు. దీని బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది అంగవైకల్యానికి గురవుతున్నారు. పూర్తిగా తమ పని చేసుకోలేని స్థితిలో పూర్తిగా అన్నిటికీ వేరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది.
 
కారణాలు
డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ లక్షణాలు ఉన్న వారే ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్ట్రోక్‌ బారిన పడుతున్నారు.
 
మరి కొన్ని...
1) ధూమపానం, మద్యపానం... ఇవన్నీ ప్రధానమైనవి. కానీ, మన చేతుల్లో ఉన్నవే. వీటిని ఎంత నియంత్రించుకుంటే స్ట్రోక్‌ రాకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు.
2) వయసు మీరడం, జెనిటిక్‌ డిస్‌-పొజిషన్‌ వంటివి కూడా స్ట్రోక్‌ రావడానికి కారణాలే!
 
పరిస్థితులు మారుతున్నాయి!
ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. జంక్‌ ఫుడ్‌, వేళకాని వేళలో ఆహారం తినడం, స్ట్రెస్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండటం- ఇవన్నీ స్ట్రోక్‌కు దారి తీస్తున్నాయి. యువతీయువకుల్లో చాలా మంది ఈ స్ట్రోక్‌కు గురవుతున్నారు. అయితే వీళ్లు రికవర్‌ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా కొంత మంది పూర్తిగా నయమై మళ్లీ మామూలు స్థితికి వచ్చినవాళ్లూ ఉన్నారు. బ్రెయిన్‌కు ఎదైనా బలమైన గాయం తగిలితే మెదడు వాచిపోతుంది. దీన్ని వైద్య పరిభాషలో ‘డిఫ్యూజ్‌ ఎక్సొనెల్‌ ఇంజ్యూరీ’ అంటారు. ఇలాంటి కేసుల్లో కూడా స్ట్రోక్‌ వస్తే రికవర్‌ కావడం ఒకప్పుడు కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది.
 
మానసిక స్థైర్యమే అసలైన వైద్యం!
స్ట్రోక్‌కు గురైన వాళ్లకు రీహ్యాబిలిటేషన్‌ చాలా ముఖ్యం.
బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన పేషెంట్లు మానసికంగా ఎంతో క్రుంగిపోతారు. ఒక్కోసారి డిప్రెషన్‌లోకి వెళిపోతారు. ఓ స్నేహితునిగా, ఓ మెంటర్‌గా పేషెంట్ల మానసిక స్థితిని మెరుగుపరచాల్సిన బాధ్యత డాక్టర్‌పైన, కుటుంబసభ్యులపైన ఎప్పుడూ ఉంటుంది.
ఈ స్ట్రోక్‌కు గురైన వారు వారంతట వారు ఏ పని చేసుకోలేరు కాబట్టి ఆ బాధ్యత అంతా రీహ్యాబిలిటేషన్‌ సిబ్బంది మీదే ఉంటుంది. ఇందులో పేషెంట్‌ కుటుంబ సభ్యుల పాత్ర కూడా కీలకమే.
 పేషెంట్‌ ఆహారపు అలవాట్లు, అతని ఇష్టాయిష్టాలు కేవలం వారి హెల్పర్‌కే తెలుస్తాయి. ఇవన్నీ రీహ్యాబిలిటేషన్‌లో డాక్టర్లకు సరైన చికిత్స అందించడానికి తోడ్పడతాయి.
పేషెంట్‌కూ అన్ని వేళలా చికిత్స అందించడానికి ఫిజియోథెరపిస్ట్‌, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌, సైకాలజిస్ట్‌, ఫిజియాట్రిస్ట్‌, పారామెడికల్‌ డాక్టర్లు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలి.
డైట్‌ చార్ట్‌ ఏంటి?
లో-కొలస్ట్రాల్‌, ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది.
రీహాబ్‌లో ఇచ్చే డైట్‌నే ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఇంటికెళ్లాక కూడా వీటిని ఫాలో అయితే మళ్లీ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చు.
పూర్తిగా నయం అవుతుందా..?
స్ట్రోక్‌ పూర్తిగా నయమవుతుందా అంటే కచ్చితంగా చెప్పలేం. పేషెంట్‌ రీహాబ్‌లో చేరిన మూడు నెలలు చాలా కీలకం. మామూలు జీవితంలోకి వెళ్లి, ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్లూ ఉన్నారు. ఒక వేళ వీల్‌చైర్‌కే పరిమితమైనా, వాళ్ల పనులు వారు స్వతంత్రంగా చేసుకోగలుగుతారు. అయితే రికవరీ అనేది వారి శారీరక, మానసిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే సరైన సమయంలో స్ట్రోక్‌కు సరైన కారణం గుర్తించి, వైద్యం చేయించుకుంటే వారికి భవిష్యత్తులో ఏ ప్రమాదమూ ఉండదు.
డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌
సీనియర్‌ కన్సెల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌
అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌