మసక వెలుతురుతో మెదడుకు నష్టమే!

18-03-2018: కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుతురుతో కష్టమే గానీ, అలా అని, మసక వెలుతురుకు పరిమితమైపోతే మరింత ప్రమాదం అంటున్నారు పరిశోధకులు. రోజులో అత్యధిక సమయాన్ని మసక వెలుతురులో ఉండిపోయే ఉద్యోగులు, ఇతర వృత్తికారుల్లోని మెదడు నిర్మాణం దెబ్బతినడంతో పాటు వారి జ్ఞాపకశక్తి, గ్రహణ శక్తి బాగా తగ్గిపోయాయని వీరి పరిశోధనల్లో స్పష్టమయ్యింది. అమెరికానుంచి వచ్చే ‘హిప్పోకేంపస్‌’ అనే జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. మానవ శరీర వ్యవస్థకు దగ్గరగా ఉండే నైల్‌ గ్రాస్‌ ర్యాట్ప్‌ అనే ఒక ప్రత్యేక జాతికి చెందిన ఎలుకల మీద వీరు పరిశోధనలు చేస్తుంటారు. ఈ ఎలుకలు మనుషులకు మల్లే పగలంత చురుగ్గా ఉండి రాత్రిళ్లు నిద్రిస్తాయి.

పరిశోధకులు ఈ ఎలుకలను కొన్ని వారాల పాటు మసక వెలుగులోనూ, కొన్ని వారాలు పూర్తి వెలుగులోనూ ఉంచి చూశారు. అయితే, మసక వెలుగులో ఉంచిన ఎలుకల్లోని జ్ఞాపకశక్తికీ, గ్రహణశక్తికీ ప్రధానమైన మెదడులోని హిప్పోకాంపస్‌ అనే విభాగం సామర్థ్యం 30 శాతం దాకా తగ్గిపోవడం వారు గుర్తించారు. అదే సమయంలో నిండు వెలుగులో ఉన్న ఎలుకల్లోని మెదడు శక్తి గణనీయంగా పెరిగింది.
 
నాలుగు వారాలుగా మసక వెలుతురులో ఉన్న ఎలుకల్ని, ఆ తర్వాత నిండు వెలుతురులోకి మార్చినప్పుడు కూడా వాటి మెదడు శక్తి పెరిగింది. న్యూరాన్ల మధ్య ఆరోగ్యవంతమైన స్థితిని నిలబెట్టే న్యూరోట్రాఫిక్‌ ఫ్యాక్టర్లు కూడా మసక వెలుతురులో బాగా దెబ్బ తింటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అందుకే మెదడు గ్రహణ శక్తి, జ్ఞాపకశక్తి గరిష్టస్థాయిలో ఉండడానికి చాలినంత వెలుగులో ఉండడం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు.