కొత్త మందు!

ఆంధ్రజ్యోతి(03-10-2016): ఇప్పటిదాకా మతిమరుపు జబ్బుల్లో మహా తీవ్రమైనదిగా అల్జీమర్‌ చలామణీ అవుతూనే ఉంది. అయితే, ఈ వ్యాధిని నయం చేసేందుకు ఇటీవల కనుగొన్న ఒక కొత్త మందు సత్పలితాలు ఇస్తున్నట్లు, ప్రాధమిక అధ్యయనాల్లో బయటపడింది. నేచర్‌ అనే ఒక జర్నల్‌లో ఈ విషయాలే ప్రచురితమయ్యాయి. అల్జీమర్‌ రోగుల మెదడులో అమిలాయిడ్స్‌ అనే అసహజమైన ప్రొటీన్‌ నిలువలు పేరుకుపోతుంటాయి. అయితే, కొత్తగా కనుగొన్న ఎడుకేనూమాబ్‌ అనే ఒక మందు ఈ ప్రొటీన్‌ను ముక్కలు చేయగలుగుతోంది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఒక ట్రయల్‌గా అల్జీమర్‌ రోగుల్లో కొందరికి ఈ మందును తక్కువ మోతాదులో ఇస్తూ, మరికొందరికి ఏ మందూలేని ప్లేసిబోలను ఇచ్చి చూశారు. అయితే ఈ మందు ఇచ్చిన వారిలో అమిలాయిడ్‌ ప్రొటీన్‌ బాగా తగ్గడం కనిపించింది. ఇంకాస్త ఎక్కువ మోతాదులో మందులు ఇచ్చిన వారిలో అయితే, ఆ ప్రొటీన్‌ పెద్ద మొత్తంలో తగ్గడం కనిపించింది. ఏడాది పాటు ఈ ఎడుకేనూమాబ్‌ మందులు వేసుకునే వారిలో ఈ బీటా- అమిలాయిడ్‌ ప్రొటీన్‌ మచ్చుకైనా కనిపించలేదు. దీనికి తోడు ఈ మందుల వల్ల అల్జీమర్‌ రోగుల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోయే వేగం కూడా క్రమంగా పడిపోతూ వచ్చింది. అమెరికా, యూరప్‌, ఆసియా ఇలా 20 దేశాల్లో అల్జీమర్‌ ఇంకా ప్రారంభ దశలో ఉన్న రోగులకు ఈ మందును ఇచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తి స్థాయిలో ఫలవంతమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది అల్జీమర్‌ రోగులకు ఆ జబ్బునుంచి విముక్తి కలగడం ఖాయం.