మౌనంతో మెదడుకి ఆరోగ్యం?

14-09-2017: మౌనంగా, నిశ్శబ్దంగా ఉండడానికీ మెదడుకీ అవినాభావ సంబంధం ఉంది అంటున్నారు పరిశోధకులు. బాగా ఒత్తిడికి గురైన సందర్భంలో ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఒత్తిడి తగ్గిపోవడంతో పాటు కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయని వీరు చెబుతున్నారు. మౌనంగా ఉన్న సమయంలో మెదడులోని హిప్పొ కేంపస్‌ అనే భాగంలో కొత్త కణాలు ఏర్పడతాయని అంటున్నారు. ఈ కణాలు కొత్త ఆలోచనలు రావడానికి సహాయపడతాయని అంటున్నారు. ఇదే విషయం మీద వీరు ఎలుకల మీద పరిశోధన నిర్వహించారు. వీటిని కొన్ని రోజుల పాటు ప్రశాంతమైన ప్రదేశంలో ఎలాంటి శబ్దాలు రాని చోట ఉంచారు. కొన్ని నెలల అనతరం వీటి మెదడును పరిశీలించగా మెదడులోని హిప్పొ కేంపస్‌ ప్రాంతంలో కొత్త కణాలు ఏర్పడడాన్ని వీరు కనుగొన్నారు. ఒక వ్యక్తిలోని భావోద్వేగాలను, జ్ఞాపకాలను, నైపుణ్యాన్ని హిప్పొ కేంపస్‌ నియంత్రిస్తుంది. ఈ ప్రాంతంలో కొత్త కణాలు ఏర్పడడం వలన మన మెదడు మరింత చురుకుగా ఆరోగ్యంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు చేయవలసి ఉందని వారు అంటున్నారు. ఏది ఏమైనా సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండగలితే ఆలోచనలు పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని వారు సూచిస్తున్నారు.