రోజూ ఇన్ని అడుగులేస్తే మెదడు భద్రం!

వాషింగ్టన్‌, జూలై 17: వృద్ధాప్యంలో మెదడు పనితీరు తగ్గి అల్జీమర్స్‌ (మతిమరుపు) సమస్యలు వస్తుంటాయి. అయితే.. వయసు పైబడినవారు రోజూ 8,900 అడుగులు నడిస్తే అల్జీమర్స్‌ నుంచి తమను తాము రక్షించుకోవడమే కాకుండా వారి మెదడు పనితీరు కూడా మెరుగవుతుందని అమెరికాకు చెందిన మసాచుసెట్స్‌ జనరల్‌ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు. రోజూ వాకింగ్‌ చేసే వృద్ధుల్లో అల్జీమర్స్‌ వ్యాధి సంకేతాలు కనిపించే అవకాశం తక్కువని వారు తాజా అధ్యయనంలో గుర్తించారు. సగటు వయసు 73 ఏళ్లున్న 182 మంది వృద్ధులను వారు పరిశీలించారు.
 
ఆరేళ్లపాటు వారి దినచర్య, శారీరక శ్రమను గమనించారు. వారి బ్రెయిన్‌ స్కాన్‌లను కూడా పరిశీలించారు. మెదడులోని కణజాలం దెబ్బతిన్న వారిలో అల్జీమర్స్‌ సంకేతాలను గుర్తించారు. అయితే.. రోజూ వాకింగ్‌ చేస్తూ చురుకుగా ఉన్న వారిలో మాత్రం మెదడు పనితీరు బాగా ఉన్నట్టు గమనించారు. రోజుకు సుమారు 8,900 అడుగులు నడిచే వారి మెదడులో కణజాలం దెబ్బతినే అవకాశాలు తక్కువని, తద్వారా వారు అల్జీమర్స్‌ బారిన పడకుండా ఉండొచ్చని డాక్టర్లు తెలిపారు.