నడకతో మెదడు ఆరోగ్యం!

07-02-2018: నడకతో కలిగే ఆరోగ్య లాభాల గురించి తెలిసిందే! యువకులు, మధ్య వయస్కులకన్నా వృద్ధులకే నడక ద్వారా మరిన్ని ఆరోగ్య లాభాలు చేకూరతాయి అంటున్నారు పరిశోధకులు. వృద్ధులు ప్రతిరోజూ నాలుగువేల అడుగులు నడవడం వలన వారిలో మతిమరుపు సమస్య తలెత్తదనీ, అంతకు ముందు కన్నా మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందన్న విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. అరవై సంవత్సరాలు పైబడిన కొంతమంది వృద్ధుల మీద పరిశోధనలు నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారితో రోజుకు నాలుగువేల అడుగులు నడవమని చెప్పారు. రెండవ గ్రూపు వారితో వారు రోజూ నడిచే విధంగానే నడవమన్నారు. కొన్ని రోజుల అనంతరం వీరి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. రోజుకు నాలుగువేల అడుగులు నడిచిన వారిలో జ్ఞాపకశక్తి మునుపటి కన్నా మెరుగ్గా ఉండడం, వారి మెదడు మరింత చురుకుగా పనిచేయడం గమనించారు. రెండవ గ్రూపువారిలో అలాంటి మార్పును గమనించలేదు. కేవలం నడవడం వలనే వీరిలో ఈ మార్పు సాధ్యమైందా? అన్న విషయం మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వారు అంటున్నారు.