మెదడును ఉత్తేజపరిచే గ్రీన్‌ టీ

17-08-2017: గ్రీన్‌ టీతో బరువును అదుపులో ఉంచుకోవచ్చు అన్న సంగతి తెలిసిందే! ఈ టీ తాగడం వలన మరో ప్రయోజనం కూడా ఉందని అంటున్నారు పరిశోధకులు. గ్రీన్‌టీలోని ఇజిసిజి అనే సమ్మేళనం మెదడును ఉత్తేజపరిచి దాని పనితనాన్ని మెరుగుపరుస్తుందన్న విషయం చైనాలోని ఓ యూనివర్శిటీ వారు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. కొన్ని ఎలుకల మీద వీరు పరిశోధన నిర్వహించారు. వీటికి ప్రతిరోజూ మామూలుగా ఇచ్చే ఆహారంతో పాటు గ్రీన్‌టీని కూడా ఇచ్చారు. కొన్ని రోజుల అనంతరం వీటిని పరిశీలించగా, వీటి బరువులో మార్పును గమనించారు. అంతేకాకుండా వీటి మెదడు పనితీరు గతం కన్నా చురుకుగా ఉండడం గుర్తించారు. ఇదంతా గ్రీన్‌ టీ వలనే కలిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయం మీద వీరు ఇంకా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా రోజు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్‌ టీ తాగడం వలన మంచి ఫలితాలే పొందవచ్చని వీరు స్పష్టం చేస్తున్నారు.