గుండె గుభేల్‌మనిపించే బీపీ

07-07-13

 
ఇప్పటి దాకా బీపీ అంటే బీపీయే. కానీ, అందులో ఎన్ని రకాలుంటాయో ఎంత మందికి తెలుసు? నిజానికి ఆ రకాలు తెలిస్తే గానీ అందుకు అవసరమైన చికిత్స ఇవ్వడం సాధ్యం కాదు. డాక్టర్‌ గదిలో 2 నిమిషాల్లో తీసే బీపీతోనే ఒక నిర్ధారణకు రావడం ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే డాక్టర్‌ను చూడగానే బీపీ గుండె గుభేల్‌మనేలా పెరగనూవచ్చు లే క డాక్టర్‌ గదిలో మామూలుగా ఉండి ఇంట్లో తారస్థాయికి చేరవచ్చు. అందుకే హోమ్‌ బీపీ, వీలైతే 24 గంటల పాటు బీపీ మానిటర్‌ చేసే యంత్రం సహాయంతో బీపీ నిర్ధారణకు రావడం మంచిదని  అంటున్నారు సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ టి. శశికాంత్‌.
 
ఏ కొంచెం అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్‌ లేదా నర్సు ముందుగా రక్తపోటు(బీపీ) ఎంత ఉందనేది చెక్‌ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, బీపీ గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కొందరిలో అప్పటి వరకు బీపీ నార్మల్‌గా ఉంటుంది. డాక్టర్‌ను చూడగానే భయం మొదలవుతుంది. ఎన్ని మందులు రాస్తాడో, ఏం జబ్బు ఉందని చెబుతాడో అనే ఆందోళన మొదలవుతుంది. ఆ భయంతో డాక్టర్‌ గదిలోకి అడుగుపెట్టగానే బీపీ పెరిగిపోతుంది. గదిలో నుంచి బయటకు వెళ్లగానే మళ్లీ నార్మల్‌ అయిపోతుంది. దీన్ని వైట్‌కోట్‌ హైపర్‌టెన్షన్‌ అంటారు. మరి కొందరికి డాక్టర్‌ దగ్గరకు వచ్చినప్పుడు బీపీ నార్మల్‌గా ఉంటుంది. ఎన్ని ఆసుపత్రులకు వెళ్లినా, ఎందరు డాక్టర్లకు చూపించినా బీపీ సాధారణ స్థాయిలోనే ఉంటుంది. బయటకు వెళ్లగానే అంటే అసుపత్రి నుంచి బయట అడుగుపెట్టగానే బీపీ పెరిగిపోతుంది. దీనిని మాస్క్‌డ్‌ హైపర్‌టెన్షన్‌ అంటారు. అంటే నిజంగా బీపీ ఉన్న వారికి మందులు ఇవ్వకుండా, బీపీ లేని వారికి మందులు ఇవ్వడం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం బీపీ అన్ని వేళలా ఎలా ఉంటుందో తెలుసుకోకపోవడమే. 
ఏం చేయాలి?
బీపీని సరిగ్గా నిర్ధారించాలంటే హోమ్‌ బీపీని చెక్‌ చేయడం తప్పనిసరి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతారు. ఆ సమయంలో తీసుకున్న బీపీ సరైనదిగా నిర్ధారించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు 24 గంటలు బీపీ రికార్డు చేసే యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. చేతికి అ మిషన్‌ అమర్చడం ద్వారా భోజనం చేస్తున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు, టెన్షన్‌కు గురయినప్పుడు...ఇలా ప్రతి సమయంలోనూ బీపీ రికార్డు అవుతుంది. 
బీపీ చెక్‌ చేసే సమయంలో...
డాక్టర్‌ బీపీ చెక్‌ చేసే సమయంలో కొందరు తెలియకుండానే ఆందోళనకు లోనవుతుంటారు. అలాకాకుండా బీపీ తీసుకునే సమయంలో ప్రశాంతంగా ఉండాలి. రెండు సార్లు గట్టిగా ఊపిరి పీల్చి వదలాలి. ఒకేసారి కాకుండా రెండుసార్లు బీపీ తీయాలి. మొదటి సారి కన్నా రెండవసారి తీసుకునే బీపీ కచ్చితమైనదిగా నిర్ధారించుకోవాలి. 
బ్లైండ్‌ స్పాట్‌
ఇప్పుడంతా బిజీ జీవితం. ఉదయం మెల్కోగానే టెన్షన్‌ మొదలవుతుంది. పిల్లలను స్కూలును పంపించాలనే తొందర, ఆఫీసుకు లేట్‌ అయిపోతుందనే ఆందోళన, పని ఇంకా పెండింగ్‌ ఉందనే టెన్షన్‌... ఇలా ఒక్కటేమిటి, మొత్తం జీవితం టెన్షన్‌ మయం. ఈ సమయంలో బీపీ హెచ్చుస్థాయిలో ఉంటుంది. మరి ఈ సమయంలో ఎవరూ బీపీని రికార్డ్‌ చేయడం లేదు. అందుకే దీన్ని బ్లైండ్‌ స్పాట్‌ అంటారు. హార్ట్‌ ఎటాక్స్‌ వచ్చే అవకాశం కూడా ఈ సమయంలోనే ఎక్కువ. హార్ట్‌ ఎటాక్‌ కేసులను పరిశీలిస్తే ఉదయం 6 నుంచి 9 గంటల మధ్యన వచ్చినవే ఎక్కువగా ఉంటాయి. అందులోనూ సోమవారం రోజు మరింత ఎక్కువ. ఎందుకంటే వారాంతంలో హాయిగా గడుపుతారు. సోమవారం రాగానే మళ్లీ టెన్షన్లన్నీ మొదలవుతాయి. అందువల్ల బీపీలో హెచ్చుతగ్గులుంటుంటాయి.
హెచ్చుతగ్గులు ఉండాల్సిందే!
కొందరికి బీపీ తగ్గడం, పెరగడం జరుగుతూ ఉంటుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు బీపీ పెరుగుతుంది. పడుకున్నప్పుడు తగ్గుతుంది. ప్రతి ఒక్కరికీ ఇలా జరగడం సహజమే. జరగాలి కూడా. కానీ కొందరిలో ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే స్థాయిలో బీపీ ఉంటుంది. వీరికి రిస్క్‌ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. 
బీపీలో రకాలు
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళ బీపీ వేరు వేరుగా ఉంటుంది. పడుకున్నప్పుడు బీపీ వేరేగా ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు బీపీ పడిపోతే డిప్పర్స్‌ అంటారు. కొందరికి నిద్రలో మరీ తక్కువగా పడిపోతుంది. వీరిని ఎక్స్‌ట్రీమ్‌ డిప్పర్స్‌ అంటారు. వీరికి రిస్క్‌ ఎక్కువ. మరి కొందరికి నిద్రలో బీపీ తగ్గడం జరగదు. వీరిని నాన్‌ డిప్పర్స్‌ అంటారు. ఇదిలా ఉంటే కొందరికి నిద్రలో కూడా బీపీ పెరిగిపోతుంది. వీరిని రైజర్స్‌ అంటారు. గురక పెట్టేవారు ఈ కోవకు చెందుతారు.
అధిక రక్తపోటుతో నష్టమేంటి? 
బీపీ ఎక్కువగా ఉంటే గుండెకు నష్టం జరుగుతుంది. హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మెదడుపై ప్రభావం పడి పక్షవాతం రావచ్చు. మూత్రపిండాలు విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. కంటి చూపు కూడా దెబ్బతినవచ్చు. 
రిస్క్‌ పెరిగేదిలా...
సాధారణంగా ఒక వ్యక్తికి 115/75 బీపీ ఉందని అనుకుంటే 6 నెలల తరువాత అతనికి బీపీ 135/85కి పెరిగినట్లయితే గుండె జబ్బులు వచ్చే అవకాశం రెండు రెట్లు పెరుగుతుంది. అదే 155/95కి పెరిగినట్లయితే నాలుగు రెట్లు, 175/100 అయినట్లయితే 8 రెట్లు పెరుగుతుంది. అంటే నార్మల్‌ బీపీ కన్నా 20 పాయింట్లు ఎక్కువ పెరిగితే 2 రెట్లు, 40 పాయింట్లు పెరిగితే 4 రెట్లు, 60 పాయింట్లు పెరిగితే 8 రెట్లు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 
వయసుతో సంబంధం
సాధారణంగా వయసు పైబడిన వారిలో బీపీ పెరుగుతూ ఉంటుంది. 60 ఏళ్లు వచ్చేసరికి బీపీ వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. 70 ఏళ్లు వచ్చేసరికి 70 శాతం, 80 ఏళ్లు వచ్చే సరికి 90 శాతం అవకాశం ఉంటుంది. బీపీ నుంచి ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదు. 
సెకండరీ హైపర్‌టెన్షన్‌
కిడ్నీకి రక్త సరఫరా తక్కువగా ఉండటం, థైరాయిడ్‌ సమస్య, ఎడ్రినాలిన్‌ గ్రంధి సమస్య, ట్యూమర్స్‌ ఉండటం వంటి కారణాల వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని సెకండరీ హైపర్‌టెన్షన్‌ అంటారు. 
ఇలా చేస్తే....
బీపీ ఇప్పుడిప్పుడే సాధారణ స్థాయిని దాటుతోందా? అయితే బీపీని నియంత్రణలో ఉంచడానికి నడుం బిగించండి. మీరు అధిక బరువు ఉంటే కనుక ఒక పది కేజీల బరువు తగ్గండి. దీంతో బీపీ 5-20 మి.మీలు తగ్గుతుంది. పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. మంచి డైట్‌ప్లాన్‌ను ఫాలో అవ్వండి. దీంతో మరో 8-14 మి.మీలు తగ్గుతుంది. ఉప్పు వాడకాన్ని తగ్గించడం ద్వారా 2-8 మి.మీలు తగ్గవచ్చు. శారీరక వ్యాయామం ద్వారా 4-9మి.మీలు తగ్గే వీలుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే బీపీ 20 పాయింట్లు తగ్గిపోతుంది. అప్పుడు బీపీ మాత్రల వరకు వెళ్లే అవకాశం లేకుండా పోతుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గుర్తుపెట్టుకోండి.
 
డాక్టర్‌ టి. శశికాంత్‌
సీనియర్‌ కార్డియాలజిస్ట్‌
యశోద హాస్పిటల్‌
సికింద్రాబాద్‌, హైదరాబాద్‌
ఫోన్‌ : 98495 69995