కంగారుగా తినేవారికి హెచ్చరిక

కంగారుగా తినేవారికి బీపీ, గుండెజబ్బుల ముప్పు

15-11-2017: కొంతమంది గబగబా తినేస్తూవుంటారు. అలాంటి వారికి రక్తపోటు, స్థూలకాయం, మధుమేహంతోబాటు గుండెజబ్బుల ముప్పు పొంచివుందని హిరోషిమా యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ముద్దనూ ఆస్వాదిస్తూ.. ప్రశాంతంగా తినేవారికి అన్నిరకాలుగా ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. వెయ్యిమందికిపైగా మధ్య వయస్కులపై ఐదేళ్లపాటు పరిశోధన జరిగింది. వారిలో నెమ్మదిగా ఆహారం తినేవారికంటే.. వేగంగా తినేవారికి ఒబెసిటి, హై బీపీ, బ్లడ్‌ షుగర్‌, కొలెస్ట్రాల్‌ ముప్పు ఐదున్నర రెట్లు ఎక్కువని తేలింది. 

వేగంగా తినేవారిలో రోగాలబారినపడే ప్రమాదం 11.6 శాతమైతే, నార్మల్‌ స్పీడ్‌తో తినేవారికి 6.5 శాత మే ఉంటుందని హిరోషిమా వర్సిటీ పరిశోధకుడు తకయుకి యమజి వెల్లడించారు. స్పీడ్‌గా తింటే శరీరంలో గ్లూకోజ్‌ ఒడిదుడుకులు ఏర్పడి.. ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుందని చెప్పారు. కంగారుగా తింటూపోతే.. వాళ్లు ఏం తింటున్నారో శరీరం గుర్తించడానికి సమయం ఉండదనీ, దీంతో ఇంకా ఎక్కువ తినేస్తారని తెలిపారు. బరువు తగ్గాలనుకుంటే మెల్లగా నమిలి తినాలంటున్నారు.