బ్లాకర్స్‌ ఉపయోగ మేమిటి?

20-09-2017: మా నాన్నగారికి గత రెండేళ్లుగా అధిక రక్తపోటు సమస్య ఉంది. డాక్టర్‌ ఆయనకు నిరంతరంగా క్యాల్షియం చానల్‌ బ్లాకర్స్‌ ఇస్తున్నారు. ఇవి ఏరకంగా రక్తపోటును నియంత్రిస్తాయి. దీర్ఘకాలికంగా వీటిని వాడటం వల్ల దుష్ప్రభావాలు ఏమీ ఉండవా? ఆ వివరాలు తెలియచేయండి.

- రవి కుమార్‌, భద్రాచలం

రక్తనాళాలను విశాలం చేసి, రక్తప్రవాహపు ఒత్తిడిని తగ్గించడం ద్వారా క్యాల్షియం చానల్‌ బ్లాకర్లు రక్తపోటును తగ్గిస్తాయి. శరీరంలో వేరే వ్యాధులేమీ లేకపోయినా వచ్చే ఎసెన్షియల్‌ హైపర్‌ టెన్షన్‌ రోగులకు ఈ మందులు బాగా ఉపయోగపడతాయి. వీటి వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా స్వల్పమే. కాకపోతే ఈ మందుల్ని హార్ట్‌ ఫెయిల్యూర్‌ సమస్య ఉన్నవాళ్లకు మాత్రం వాడకూడదు.

 
ఎలా పనిచేస్తాయి?
క్యాల్షియం చానల్‌ బ్లాకర్స్‌ రక్తనాళాల్ని రిలాక్స్‌ చేసి అవి పూర్తిగా తెరుచుకునేలా చేస్తాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం సాఫీగా ప్రవహించి, రక్తపోటు దిగువ స్థాయికి వచ్చేస్తుంది..
వేరే రకమైన మరికొన్ని క్యాల్షియం చానల్‌ బ్లాకర్స్‌, గుండె చలనాన్ని నిదానపరిచి, గుండె, తక్కువ రక్తాన్ని పంప్‌ చేసేలా చేస్తాయి. ఇలా కూడా రక్తపోటు తగ్గుతుంది.
సహజంగా అయితే కండరాలు ముడుచుకోవడానికి క్యాల్షియం అయాన్ల అవసరం ఉంటుంది. కాకపోతే అధిక రక్తపోటు సమస్య ఉన్న వారికి ఇవి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందువల్ల బ్లాకర్స్‌ను వాడినప్పుడు అవి గుండె కండరంలోకి, రక్తనాళాల గోడల్లోని మృదుకండరంలోకి క్యాల్షియం అయాన్లు ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. దానివల్ల గుండె కండరపు సంకోచ శక్తి తగ్గిపోయి రక్తనాళాలు విశాలమవుతాయి. దీనివల్ల రక్తపోటు సమస్య నియంత్రణలోకి వస్తుంది.
 
దుష్ఫలితాల్లో కొన్ని.....
కొందరిలో గుండె లయ (హార్ట్‌ రిథమ్‌)లో క్రమబద్ధత లోపించవచ్చు
కొందరిలో ఈ మందుల వల్ల గుండె పనితనం తగ్గవచ్చు.
కొందరిలో ముఖం ఉబ్బరించవచ్చు
అందువల్ల ఇలాంటి గుండె సంబంధ విపరిణామాలు ఏర్పడే వారు క్యాల్షియం చానల్‌ బ్లాకర్లను వాడకపోవడం మంచిది. అయితే డాక్టర్లు ఇ.సి.జి చేయించి దాన్ని బట్టి అనువైన మందులు సూచిస్తారు. మందుల్ని సరైన మోతాదులో వేసుకుంటే మీకు ఏ సమస్యా రాదు.
- డాక్టర్‌ హెచ్‌ నరేంద్ర, కడప