అధిక రక్తపోటు..అపోహలెన్నో..!

ఒకప్పుడు అతి కొద్దిమందిలోనే కనిపించే అధిక రక్తపోటు సమస్య ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తోంది. దాదాపు ప్రతి ముగ్గురిలోనూ ఒకరు ఈ సమస్య బారినపడుతున్నారు. అందుకే నలుగురి గుమిగూడిన పలు సందర్భాల్లో ఈ విషయం చర్చకొస్తోంది. ఒక్కొక్కరూ ఆ సమస్య మీద ఎలా నియంత్రణ సాధించారో తమ స్వానుభవాలను జత చేసి చెబుతుంటారు. సమస్య ఏమిటంటే కొందరిలో అపోహలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.  ఇవి ఒక్కోసారి ప్రాణాపాయానికి దారి తీసే ప్రమాదం కూడా ఉంది.   అలాంటి అపోహల్లో ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిస్తే....!

అపోహ-1: ‘రక్తపోటు పెరిగితే నాకు తెలిసిపోతుంది’
మామూలుగానే తెలిసిపోయే అవకాశమే ఉంటే అధిక రక్తపోటుకు ‘నిశ్శబ్ధ హంతకి’ అన్న  పేరెందుకు వచ్చింది? వాస్తవానికి  సమస్య మరీ తీవ్రమైతే తప్ప  చాలా మందికి తమకసలు ఆ సమస్య ఉన్నట్లే తెలియదు. గుండె రక్తాన్ని పంప్‌ చేసే సిస్టాలిక్‌ 160 ఎం. ఎం. హెచ్‌జి కి గుండె విరామం తీసుకునే డయాస్టాలిక్‌ 100 ఆ పైన ఉండే ఈ తీవ్రస్థితిని స్టేజ్‌-2 హైపర్‌ టెన్షన్‌ అంటారు. ఈ స్థితిలో కూడా అతికొద్ది మందికి తలనొప్పి రావచ్చు గానీ మిగతా వారికి ఆ  లక్షణమేదీ ఉండదు. సాధారణ స్థితికన్నా కొంచెం ఎక్కువగా ఉండే వారైతే అసలు గుర్తించే అవకాశమే లేదు. మరే కారణంగానో డాక్టర్‌ వద్దకు వెళ్లినప్పుడు హఠాత్తుగా తమకు అధిక రక్తపోటు సమస్య ఉందని తెలిసి ఆశ్చర్యపోవడం తప్ప ముందే గుర్తించే అవకాశమేదీ ఉండదు. 
అపోహ-2: ‘వయసుకు 100 కలపాలి’
వయసు 50 ఏళ్లుంటే దానికి 100 కలపాలని ఆ రకంగా  సిస్టాలిక్‌ 150 ఎం. ఎం హెచ్‌.జి ఉంటే అది సాధారణ రక్తపోటుగానే భావించాలని కొందరు చెబుతుంటారు. వాస్తవానికి ఇది పూర్తిగా తప్పుడు కొలమానం. 18 ఏళ్లు దాటిన ఏ వయసులోనైనా సిస్టాలిక్‌  ప్రెషర్‌ 120 కన్నా తక్కువగా డయాస్టాలిక్‌ 80 కన్నా తక్కువగానే ఉండాలి. ఇదే సరియైున రక్తపోటు. వయసుకు 100 కలపడం అన్నది ఎంత మాత్రం సరికాదు.
అపోహ-3 ‘క్రమం తప్పకుండా మందులు వేసుకుంటే చాలు’
రక్తపోటును నియంత్రించడంలో మందులు నిక్కచ్చిగా పనిచేస్తాయనేది వాస్తవమే. కానీ,  జీవన శైలిలో మార్పులు చేసుకుంటే అది అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ బరువు 10 శాతం తగ్గితే, రక్తపోటు 10 పాయింట్లు తగ్గుతుంది. దానికి వాకింగ్‌ బాగా తోడ్పడుతుంది. మానసిక ఒత్తిళ్లను తగ్గించే యోగా, ధ్యానాలు రక్తపోటును తగ్గించడంలో బాగా సహాయకారిగా ఉంటాయి.  పొటాషియం పరిమాణం ఎక్కువగానూ, సోడియం తక్కువగానూ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ఎక్కువ ప్రయోజనకరం. ఈ నియమాలు పాటిస్తూ వెళితే, ఒక దశలో మందుల మోతాదు తగ్గించే అశకాశం ఏర్పడటంతో పాటు తీసుకున్న మందులు మరింత మెరుగ్గా పనిచేసే స్థితి ఏర్పడుతుంది. 
అపోహ-4 ‘ రక్తపోటు తగ్గుముఖం కాగానే మందులు మానేస్తాను’
రక్తపోటు బాధితుల్లో చాలా మంది సమస్య అదుపులోకి వచ్చినట్లనిపించగానే మందులు వేసుకోవడం మానేస్తారు. మందులు వేసుకోవడం వల్ల  వచ్చిన ఆ అదుపు, మందులు మానేస్తే ఉండదనే విషయాన్ని వీరు గ్రహించరు. ఫలితంగా మానేసిన కొద్ది రోజులకే రక్తపోటు ప్రమాద స్థితికి చేరుతుంది. ఆహారపు అలవాట్లను, జీవన శైలిని సమూలంతా మారిస్తే తప్ప ఆ మందుల్ని జీవితాంతం వేసుకోవడం తప్పనిసరి అవుతుంది.