టెన్షన్‌ పెట్టే ‘హైపర్‌టెన్షన్‌’!

13-08-2019: నల్లాలో నీరు తగినంత ఫోర్స్‌తో వస్తేనే ధార చక్కగా పడుతుంది. నీటి వేగం ఎక్కువైనా, తక్కువైనా ధారలో తేడా వచ్చినట్టే, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు ఒత్తిడిలో కూడా ఇలాంటి హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. అదే హైపర్‌టెన్షన్‌! గుండెకు చేటు చేసే ఈ నిశ్శబ్ద రుగ్మత పట్ల అప్రమత్తంగా ఉండాలి!
 
ప్రతి వ్యక్తి శరీరంలోని రక్తంలో కొంత ప్రెషర్‌ ఉంటుంది. ఆ ప్రెషర్‌ వల్లే గుండె నుంచి రక్తం, శరీరంలోని రక్తనాళాలు అన్నింట్లోకి సక్రమంగా స్రవిస్తుంది. ఆ ప్రెషర్‌ అవసరానికి మించి ఎక్కువ ఉంటే ఆ పరిస్థితినే ‘హైపర్‌టెన్షన్‌’ అంటారు. 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువాళ్లకు బ్లడ్‌ ప్రెషర్‌ 140/90 వరకూ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. పసికందులు, స్కూలుకి వెళ్లే వయసు పిల్లలకు బీపీ ఇంకా తక్కువగా ఉంటుంది. అది సాధారణమే! 50 ఏళ్లు దాటిన వారికి వయసుతోపాటు బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది. రక్తపోటు పెరిగిపోతే ఆ ప్రభావం ప్రధానంగా గుండె మీద పడుతుంది. వేగంగా గుండెకు రక్తం చేరుతూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో గుండె కండరాలు, కవాటాల్లో సమస్యలు మొదలవుతాయి. రక్తాన్ని వడగట్టే మూత్ర పిండాలు కూడా దెబ్బతింటాయి. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? అనే విషయాల్లోకి లోతుగా వెళ్తే కచ్చితమైన సమాధానం దొరకకపోవచ్చు.
 
హైపర్‌టెన్షన్‌కు ఎన్నో కారణాలుంటాయి. వయసుతో పని లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా హైపర్‌టెన్షన్‌ రావొచ్చు. అయితే అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు ప్రధానంగా కొన్ని ఉన్నాయి. అవేంటంటే....
అధిక బరువు: అధిక బరువు వల్ల శరీరం లావవుతుంది. దాంతో చర్మం ఉపరితలం వరకూ రక్తసరఫరా జరపటం కోసం రక్తనాళాలు చెట్టు కొమ్మల్లా పెరుగుతూ పోతాయి. వాటి చివర్ల వరకూ రక్తం సరఫరా కావాలంటే రక్తం ఫోర్స్‌ పెరగాలి. ఇందుకోసం గుండె మరింత బలంగా రక్తాన్ని పంప్‌ చేయాలి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే రక్తంలో ప్రెషర్‌ పెరిగిపోయి హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తుంది.
ఒత్తిడి: మానసికం, శారీరకం... ఒత్తిడి ఎలాంటిదైనా దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఒత్తిడితో కూడిన జీవనవిధానాన్ని అవలంబించేవాళ్లు హైపర్‌టెన్షన్‌కి తేలికగా గురవుతారు.
అస్తవ్యస్థ జీవనశైలి: సమయానికి నిద్ర, ఆహారం తీసుకోకపోవటం, రోజుల తరబడి నిద్రకు దూరం కావటం, భోజనానికి నియమిత వేళలు పాటించకపోవటం...ఇలాంటి అస్తవ్యస్థ జీవనశైలిని అనుసరించినా అధిక రక్తపోటు ఖాయమే!
 
అధిక ఉప్పు: ఉప్పు (సోడియం క్లోరైడ్‌)లో ఉండే ‘సోడియం’ వల్లే ముప్పంతా! కాబట్టి సోడియం ఉండే పదార్థాలను ఎక్కువగా తినటం వల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది.
 
దురలవాట్లు: హైపర్‌టెన్షన్‌కు మద్యపానం, ధూమపానం కూడా కారణమే! ధూమపానం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్త సరఫరా ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో గుండె రక్తాన్ని బలంగా పంప్‌ చేయాల్సి వస్తుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి పెరిగి హైపర్‌టెన్షన్‌ మొదలవుతుంది. మద్యపానం వల్ల కూడా బీపీ పెరుగుతుంది.
 
మధుమేహం: మధుమేహం ఉన్నా ఆ ప్రభావం బ్లడ్‌ ప్రెషర్‌ మీద పడుతుంది. దాంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే రక్తపోటు పెరుగుతుంది.
 
లక్షణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు
రక్తపోటు ఉన్న వాళ్లలో చాలామందికి ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు వైద్య పరీక్షల్లో ఈ విషయం బయటపడితే తప్ప తమంతట తాముగా రక్తపోటు ఉన్న విషయాన్ని ఎక్కువశాతం మంది గ్రహించలేరు. అయితే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే...
గుండె దడ
తలనొప్పి, చమటలు పట్టడం
కళ్లు తిరగటం
ఆయాసం

చికిత్స తేలికే!

రక్తపోటును మందులతో నియంత్రించవచ్చు. అయితే మందులు సక్రమంగా వాడుతున్నా రక్తపోటు అదుపులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా నెలకోసారి బీపీ పరీక్షించుకుంటూ ఉండాలి. దాన్నిబట్టి వైద్యులు మందుల మోతాదు పెంచటం, తగ్గించటం చేస్తారు. కొన్నిసార్లు మందుల ప్రభావం ఎక్కువై బీపీ తగ్గిపోతుంది కూడా! అలాంటప్పుడు రక్తపోటును స్థిరంగా ఉంచే మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడవలసి ఉంటుంది.