బాబోయ్‌.. బీపీ, షుగర్‌

భయపెడుతున్న సైలెంట్‌ కిల్లర్స్‌.. తెలంగాణలో అసాధారణ రీతిలో పెరుగుతున్న బాధితుల సంఖ్య

రక్తపోటు.. వైద్యుడి దగ్గర బీపీ పరీక్ష చేయించుకునే దాకా తెలియదు! మధుమేహం.. ఎప్పుడూ నీరసంగా అనిపించడం, ఎక్కువగా ఆకలి వేయడం వంటి లక్షణాలు కనిపించేదాకా గుర్తించలేం!! ఒకసారి వచ్చాక వాటిని నియంత్రణలో ఉంచగలమే తప్ప.. పూర్తిగా నయం కావు. అందుకే, ఆ రెండిటినీ ‘నిశ్శబ్ద హంతకులు’గా వ్యవహరించడం కద్దు. నిజమే.. అవి సైలెంట్‌ కిల్లర్లే. తెలంగాణలో అసాధారణ రీతిలో పెరుగుతున్న బీపీ, షుగర్‌ కేసులే ఇందుకు ఉదాహరణ. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్‌సీడీ (నాన్‌కమ్యూనికబుల్‌ డిసీజె్‌స-సాంక్రమిక వ్యాధులు కానివి) స్ర్కీనింగ్‌లో.. రక్తపోటు, మధుమేహ రోగులకు సంబంధించి వెల్లడవుతున్న గణంకాలే ఇందుకు ఉదాహరణ.

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రమాదకరస్థాయిలో పెరుగుతోంది. 30 ఏళ్లు దాటిన చాలా మంది వీటి బారిన పడుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్‌సీడీ స్ర్కీ నింగ్‌లో ఆందోళనకు గురిచేసే గణాంకాలు వెల్లడవుతున్నాయి. దేశంలో అత్యధికంగా రక్తపోటు, మధుమేహ బాధితులున్న రాష్ట్రంగా ఇప్పటికే కేరళ పేరుగాంచింది. తెలంగాణ త్వరలోనే ఆస్థానంలో చేరుతుందనిపిస్తోంది. అంటువ్యాధులు కాని వ్యాధులతో ఎంతమంది బాధపడుతున్నారో గుర్తించే ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌ ప్రొగ్రామ్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలతో రాష్ట్రంలో 2017 నుంచి చేపట్టారు. 33 జిల్లాల్లో 3 దశల్లో కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. తొలిదశ స్ర్కీనింగ్‌ 12 జిల్లా ల్లో నడుస్తుండగా, ఫిబ్రవరి 15నుంచి మరో 11 జిల్లాల్లో కొనసాగుతోంది. జూన్‌ నుంచి మిగిలిన జిల్లాల్లోనూ ఎన్‌సీడీ నిర్వహించి ఆగస్టు నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 

పరీక్షలు ఇలా..

30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఆశా, ఎఎన్‌ఎమ్‌లు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం 12 జిల్లాల్లోని 1,04,69,241 జనాభాలో 30 ఏళ్లు నిండిన వారు 38,73,619 మంది ఉన్నారు. ఇందులో 32 లక్షల మందికి మే మొదటి వారానికి పరీక్షలు పూర్తయ్యాయి. తమకు బీపీ ఉన్నట్లు ఈ పరీక్షల ద్వారా కొత్తగా 2.14 లక్షల మంది తెలుసుకున్నారు. పాత కేసులను కూడా కలిపితే 2.72 లక్షల మంది రక్తపోటుతో బాధపడుతున్నట్లుగా తేలింది. ఇక షుగర్‌ వ్యాధిగ్రస్తుల విషయానికొస్తే 12 జిల్లాల్లో 16 లక్షల మంది ఉన్నట్లు ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌లో బైటపడింది. కాగా ఏడాది కాలంలోనే వీటి బారిన పడుతున్న వారి సంఖ్య అసాధారణంగా ఉన్నట్లు తేలింది. 

 

ఉమ్మడి మెదక్‌లో అత్యధికం
ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌లో భాగంగా తొలి విడత మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్‌ అర్బన్‌, భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్‌ (ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌) జిల్లాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 12 జిల్లాల్లోనూ.. బీపీ, ఇటు షుగర్‌ వ్యాధిగ్రస్తులు సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉండగా, తర్వాత సిద్దిపేటలో ఎక్కువగా ఉన్నారు. కొన్ని గణాంకాలు..
  • సంగారెడ్డి జిల్లాలో ప్రతి వంద మందిలో సగటున 15 మంది బీపీతో, 8 మంది షుగర్‌తో బాధపడుతున్నారు
  • వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో వందమందిలో 16 మంది బీపీ, 14 మంది షుగర్‌ బాధితులున్నారు.
  • సిద్దిపేటలో వందకు 14 మందికి బీపీ, ఏడుగురికి షుగర్‌ ఉన్నాయి.
  • మెదక్‌ జిల్లాలో వందకు 14 మంది బీపీ, 9 మంది సుగర్‌తో బాధపడుతున్నారు. 
  • సిరిసిల్ల జిల్లాలో ఆ సంఖ్య 14, 7 గా ఉంది.
సర్కారు ఏం చేయాలంటే...
రక్తపోటు, మధుమేహం వల్ల కాలక్రమంలో గుండె, కిడ్నీ జబ్బులు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటివి వచ్చే ముప్పు ఉంది. పరీక్షల ద్వారా వీటిని తొలిదశలోనే గుర్తించి జీవితాంతం మందులు వాడిస్తే చాలా సమస్యలు తప్పుతాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తుండగా అందులో 50ు గుండె, కిడ్నీ, బ్రెయిన్‌స్ట్రోక్‌ శస్త్రచికిత్సలకే కేటాయించాల్సి వస్తోంది. బీపీ, షుగర్‌ రోగులను ముందే గుర్తించి వారికి పద్ధతి ప్రకారం చికి త్స చేయిస్తే ఆరోగ్యశ్రీపై బడ్జెట్‌ కూడా తగ్గుతుంది. 
 
ముందే గుర్తించాలి..
రక్తపోటు, మధుమేహాన్ని అమెరికా, యూరప్‌ దేశాల్లో ముందుగా గుర్తించి జీవనశైలిని మార్చుకుంటున్నారు. మనదేశంలో గతంలో వృద్ధుల్లో బీపీ, మధుమేహం ఎక్కువగా కనిపిస్తే ఇప్పుడు 30 ఏళ్లు దాటిన వాళ్లు కూడా వీటి బారినపడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఎక్కువగా ఉండడం తో ఈ సైలెంట్‌ కిల్లర్స్‌ దాడి చేస్తున్నాయి. నిత్యం వ్యాయామం, ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చునే అలవాటును మానుకోవడం ద్వారా చాలా సమస్యలు తగ్గుతాయి. ముందస్తు పరీక్షలు, ముందస్తు చికిత్సతో మరిన్ని సమస్యలను నివారించుకోవచ్చు.
- డాక్టర్‌ శాంతారాం, నిమ్స్‌ మాజీ డీన్‌