రక్తపోటును తగ్గించే ఉల్లి

ఆంధ్రజ్యోతి,09/12/14:ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలతోనే చాలా రుగ్మతలను తగ్గించుకోవచ్చునని పరిశోధనలు పదే పదే రుజువు చేస్తూనే ఉన్నాయి. కాకపోతే చాలా మంది సమస్య బాగా తీవ్రమయ్యేదాకా నిర్లక్ష్యంగా ఉండిపోతున్నారు, ఫలితంగా ఏ అత్యవసర పరిస్థితుల్లోనో ఆసుపత్రి పాలు కావాల్సి వ స్తోంది. ఈ రోజుల్లో ఎక్కువమందిని వేధిస్తున్న అధిక రక్తపోటు సమస్యనే తీసుకుంటే ఉల్లి దానికి ఒక గొప్ప విరుగుడుగా పనిచేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఘాటుతో కళ్లల్లో నీళ్లయితే రావచ్చు గానీ, రక్తపోటును తగ్గించడంలో మాత్రం ఉల్లి ఒక ధీటైన ఔషధంగా పనిచేస్తుంది అంటున్నారు. మాత్రల రూపంలో తీసుకునే క్వెర్సిటిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌ ఉల్లిల్లో సమృద్ధిగా ఉందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది.

విరివిగా పళ్లు, కూరగాయలు తీసుకోని వారికి వైద్యులు ఈ క్వెర్సిటిన్‌ మాత్రలే ఇస్తుంటారు. అయితే ఈ మాత్రలకంటే ఎన్నో రెట్లు ప్రభావవంతంగా ఉల్లి పనిచేస్తుందని ఉఠా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యనంలో బయటపడింది. రోజుకి 730 మి.గ్రాముల ఉల్లిపాయలు తిన్నవారిలో సిస్టాలిక్‌ 7 ఎంఎం-హెచ్‌జి కి, డయాస్టాలిక్‌ 5 ఎంఎం-హెచ్‌జికి పడిపోయినట్లు స్పష్టమయ్యింది. క్వెర్సిటిన్‌తో పాటు ఆపిల్‌ లాంటి ఇతర పండ్లల్లో ఉండే ఫ్లావనాల్‌ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉల్లిలో పుష్కలంగా ఉన్నాయి. వీటికి గుండె రక్తనాళాల్లో వచ్చే సమస్యలను, పక్షవాతాన్ని సమర్థవంతంగా తగ్గించే శక్తి ఉంది. ప్రత్యేకించి క్వెర్సిటిన్‌ యాంటీ ఆక్సిడెంటులో రక్తనాళాలను కుంచింపచేసి, తద్వారా రక్తపోటును పెంచే అంశాలు శరీరంలో ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది.