అధిక రక్తపోటు గుట్టు తెలిసింది

500 జన్యువుల గుర్తింపు.. అతి పెద్ద జన్యు సంబంధ పరిశోధన

19-09-2018:మనుషుల్లో రక్తపోటును ప్రభావితం చేసే 500 కొత్త జన్యువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకు భావిస్తున్నట్లు కాకుండా అధిక రక్తపోటులో డీఎన్‌ఏ పాత్ర చాలా ఉందని కూడా తెలుసుకున్నారు. ఓ వ్యక్తి భవిష్యత్తులో అధిక రక్తపోటు బారినపడడానికి ఉన్న జన్యుపరమైన ముప్పును అంచనా వేయడానికీ ఈ పరిశోధన ఊతమిచ్చింది. రక్తపోటుకు జన్యుసంబంధ కారణాలపై ఇదే ప్రపంచంలో అతి పెద్ద పరిశోధన. దీనికి లండన్‌ క్వీన్‌ మేరీ యూనివర్సిటీ, ఇంపీరియల్‌ కాలేజీ సారథ్యం వహించాయి. పది లక్షల మంది జన్యు సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అధిక రక్తపోటు ముప్పును ముందుగానే పసిగట్టడంలో, ఔషధాల తయారీలో ఈ పరిశోధన పెద్ద ముందడుగు అని ప్రొఫెసర్‌ మార్క్‌ కాల్‌ఫీల్డ్‌ చెప్పారు. ‘స్ట్రోక్‌’, హృద్రోగాలకు ‘హై బీపీ’యే ప్రధాన కారణమవుతోంది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 78 లక్షల మంది మరణానికి అధిక రక్తపోటే కారణమని గణాంకాలు చెబుతున్నాయి.