రక్తపోటు ఇలా దూరం!

24-09-2019: మనం తీసుకునే ఆహారం కూడా రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది. అలాంటి ఆహారంలో ‘అరటి పండు’ ఒకటి. మూత్రపిండాలు మన శరీరంలోని ద్రవాలను వడపోస్తూ అదనంగా ఉన్న ద్రవాల్ని విసర్జించేలా చేస్తూ శరీరంలో నీటిశాతాన్ని సమంగా ఉంచుతూ ఉంటాయి. ఈ విధానం అంతా మన రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది. శరీరంలో ఎక్కువ ద్రవాలు నిల్వ ఉండిపోతే రక్తపోటు పెరిగిపోతుంది, తక్కువ ఉంటే రక్తపోటు పడిపోతుంది. ఈ రెండూ ప్రమాదమే!
 
ఇలా శరీరంలోని ద్రవ పరిమాణం హెచ్చుతగ్గులకు గురికాకుండా కిడ్నీలు సోడియం, పొటాషియం అనే రసాయనాల మధ్య సమ తూకాన్ని పాటిస్తాయి. పొటాషియం ఎక్కువగా నీటిని కిడ్నీల్లోకి చేరవేస్తే, సోడియం నీటిని కిడ్నీల్లోకి చేరకుండా నియంత్రిస్తుంది. మనం ఆహారం ద్వారా తీసుకునే ఉప్పు వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండిపోయి రక్తపోటు పెరిగిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే అలా నిల్వ ఉన్న నీటిని కిడ్నీల్లోకి చేరవేసే పొటాషియం ఉన్న అరటి పండ్లు తీసుకోవాలి.