రక్తపోటు ఒక సమస్యగా మారితే..

17-05-2018: నేడు ‘వరల్డ్‌ హైపర్‌టెన్షన్‌ డే’. అధిక రక్తపోటు సమస్యకు సంబంధించి కొన్ని మౌలిక అంశాల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అన్ని విధాలా మంచిదే!

సహజంగా, మన శరీరంలోని రక్తం, ధమనుల ద్వారా అన్ని అవయవాల కణజాలానికీ సరఫరా అవుతూ ఉంటుంది. ఈ ధమనుల ద్వారా రక్తం అలా శరీరమంతా ప్రవహించాలంటే, రక్తనాళాల్లో కొంత ఒత్తిడి అవసరమవుతుంది. కాకపోతే ఈ ఒత్తిడి లేదా రక్తపోటు ఒక నిర్ణీత స్థాయిలోనే (120/80) ఉండాలి. ఏ కారణంగానైనా రక్తపోటు ఆ స్థాయిని మించిపోతే దాన్నే అధిక రక్తపోటు అంటారు. రక్తపోటు పెరిగిపోయినప్పుడు కొందరిలో తలనొప్పి, తూలుతున్నట్లు అనిపించడం, కళ్లు బైర్లు కమ్మడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో ఇవేవీ కనిపించకుండానే పరిస్థితి విషమించవచ్చు.
 
మౌలికంగా, అధిక రక్తపోటు వల్ల గుండె మీద అదనపు భారం పడుతుంది. దీనివ ల్ల గుండె గోడలు గట్టిపడిపోయి, గుండె సరిగా పనిచేయలేని స్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఒక్కోసారి పక్షవాతం, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్‌, బ్రెయిన్‌ హెమరేజ్‌ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కారణాల్లోకి వెళితే, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, పొగతాగడం, మద్యపానం, కొవ్వు, కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే ఆహార పానీయాలు తీసుకోవడం, మానసిక ఒత్తిళ్లు, కిడ్నీ వ్యాధులు, కాలేయ వ్యాధుల వంటివి కనిపిస్తాయి. ఇలాంటి ఏ కారణాలతో అధిక రక్తపోటు సమస్య తలెత్తినా మందులతోనే చక్కదిద్దవచ్చు అనేది చాలా మంది డాక్టర్ల అభిప్రాయం. కానీ, శరీరం బరువు రోజురోజుకూ పెరుగుతూ వెళుతుంటే, మందు మాత్రలు ఏ మేరకు రక్తపోటును నియంత్రించగలవు? అందువల్ల రక్తపోటు నియంత్రణలో శరీర శ్రమ పాత్ర చాలా కీలకం
అసలు సమస్య అంతా, అధిక రక్తపోటు అనగానే అదేదో గుండెకు సంబంధించింది మాత్రమే అనుకోవడంలోనే ఉంది. వాస్తవానికి ఈ సమస్యకు మొత్తం శరీర వ్యవస్థలోనే తేడా రావడమే. మూలం అందులో భాగంగా, అధిక బరువుకు కారణం, శరీర శ్రమ లేకపోవడం, కొవ్వు, కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఉంటాయి. అలాంటప్పుడు శరీర శ్రమను పెంచాలే గానీ, కేవలం మాత్రలు వేసుకుంటూ ఉండిపోవడం పరిష్కారం కానే కాదు. సమస్య మొదలైన కొత్తలో మాత్రలు తప్పని సరే కావచ్చు. ఆ తర్వాతైనా రోజూ క్రమం తప్పకుండా వాకింగ్‌, జాగింగ్‌లాంటి వ్యాయామాలు చేస్తే ఒకానొక దశలో మందుల మోతాదు బాగా తగ్గిపోవచ్చు ఒక దశలో అసలు అవసరమే లేకుండాపోవచ్చు.
చాలా మందికి ఎన్నో ఏళ్లదాకా, తమకు అథిక రక్తపోటు సమస్య ఉన్నట్లుగానీ, అది బాగా తీవ్రమయింది అని గానీ తెలియదు, అనుకోకుండా మరేదో కారణంగా పరీక్షలు చేయించినప్పుడు హఠాత్తుగా బయటపడుతుంది. ఒక్కోసారి అలా తెలుసుకునే నాటికే గుండె, కిడ్నీలు, కళ్లు, లివర్‌ ఏదో ఒక స్థాయిలో దెబ్బ తిని ఉంటాయి. ఆ అవకాశం లేకుండా ప్రతి మూడు కనీస ఆరు మాసాలకు ఒకసారైనా రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి.
ఆహారపదార్థాల్లో ఉప్పు బాగా తగ్గించడం చాలా అవసరం. రోజంతా ఒక మనిషికి చిటికెడు ఉప్పు కన్నా ఎక్కువ అవసరం ఉండదు. కానీ, చాలా మంది రోజుకు ఒక టేబుల్‌ స్పూన్‌ కన్నా ఎక్కువగానే తీసుకుంటారు. వాస్తవాననికి రోజూ మనం తినే ఆకు కూరలు, కూరగాయల్లోనే శరీరానికి అవసరమైనంత సోడియం లభిస్తుంది. అందువల్ల అదనంగా మళ్లీ ఉప్పు వాడాల్సిన అవసరమే లేదు
మానసిక ఒత్తిళ్లను అధిగమించడానికి రోజుకు ఓ 15 కనీసం 10 నిమిషాల పాటైనా ధ్యానం చేయడం చాలా అవసరం. ధ్యానంలోని నిశ్శబ్దం మానసిక ఒత్తిళ్లను ఎంతో కొంత తగ్గిస్తుంది.
రోజుకు 6 నుంచి 7 గంటల సమయాన్ని నిద్రకు కేటాయించడం చాలా అవసరం. రాత్రివేళ అతిగా భోంచేసే వారికి మరికొన్ని గంటలు నిద్ర అవసరం అనిపించవచ్చు. అలా అని నిద్రా సమయాన్ని పెంచకుండా, తినే ఆహారపు మోతాదును తగ్గించడం మేలు.
పొగ తాగడం, మద్యపానం వంటివి పూర్తిగా మానేయడమే మేలు. ఎందుకంటే రక్తపోటును పెంచడంలో వీటి ప్రభావం చాలా ఎక్కువ. ఏమైనా రక్తపోటును నియంత్ర ణలో ఉంచుకోవడం అంటే, అది జీవిత కాలాన్ని పెంచుకోవడమే!