పట్టణాల్లో రక్తపోటు మగాళ్లు

కేరళలో అత్యధికం
 దేశంలో ధూమపాన బానిసలు 16శాతం
 మద్యపాన ప్రియులు 30శాతం
 ఎన్‌ఐఎన్‌-హైదరాబాద్‌ సర్వే
 
హైదరాబాద్‌, అక్టోబర్‌ 01:పట్టణాల్లో నివసించే పురుషులు మహిళల కంటే ఎక్కువగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారట. పోషకాహార లోపమే ఈ దుస్థితికి కారణమట. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌) ‘డైట్‌ అండ్‌ న్యూట్రిషనల్‌ స్టేటస్‌ ఆఫ్‌ అర్బన్‌ పాపులేషన్‌ ఇన్‌ ఇండియా అండ్‌ ప్రివెలెన్స్‌ ఆఫ్‌ ఒబెసిటీ, హైపర్‌టెన్షన్‌, డయబెటిస్‌ అండ్‌ ఇట్స్‌ అసోసియేటెడ్‌ నాన్‌ కమ్యూనికెబుల్‌ డిసీజెస్‌’ నివేదికలో వెల్లడైందీ నిజం. పట్టణాలు, నగరాల్లో నివసించే 31శాతం మంది మగాళ్లు రక్తపోటు బారిన పడ్డారట. మహిళలు 26శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారట. దేశవ్యాప్తంగా చూస్తే కేరళలో అత్యధికంగా(31 శాతం నుంచి 39 శాతం) పట్టణ పురుషులు రక్తపోటుకు గురయ్యారట. అత్యల్పంగా బిహార్‌(16 శాతం నుంచి 22శాతం) ఉందని నివేదిక తేల్చింది. ఇక, దేశంలో 30 శాతం మంది మద్యపాన ప్రియులు ఉండగా, 16 శాతం మంది దూమపానానికి బానిసలుగా మారారని వెల్లడించింది. మరోవైపు 22శాతం మంది పురుషులు, 19 శాతం స్త్రీలు మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. నేషనల్‌ న్యూట్రిషన్‌ మానిటరింగ్‌ బ్యూరో 2015-16 మధ్య 16 రాష్ట్రాల్లో 1.72లక్షల మందిని అధ్యయనం చేసి రూపొందించిన సర్వేతో ఎన్‌ఐఎన్‌ నివేదిక తయారుచేసింది.