షుగరూ బీపీ స్నేహితులా?

ఆంధ్రజ్యోతి,18-9-2016: బీపీ ఎక్కువ కావడానికి రక్తనాళం వెడల్పు తగ్గడమే కాదు, రక్త పరిమాణం (వాల్యూం) ఎక్కువ కావడం కూడా కారణం కావచ్చు. రక్తం ఎక్కువ కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. వాటిలో రక్తంలో గ్లూకోజ్‌ గానీ, ఉప్పు గానీ ఎక్కువగా ఉండడం ముఖ్యమైనవి. ఎందువల్లో ముందు తెలుసుకుందాం.

 
నీరు ఎక్కువ సాంద్రణ ఉన్న వైపు నుంచి తక్కువ సాంద్రణ ఉన్న వైపుకు ప్రవహిస్తుంది. దీన్ని ఆస్మోసిస్‌ అంటారు. నీటిలో కరిగిపోయే పదార్థాలూ, లవణాలూ లేని నీటిని మంచినీరు అంటాం. మంచినీటిలో సాంద్రణ అత్యధికంగా ఉంటుంది. నీటిలో ఏదైనా కరిగిపోయినప్పుడు, ఆ కరగడానికి కొంత నీరు వాడుకలో ఉంది కాబట్టి నీటి సాంద్రణ తగ్గుతుంది. అంటే నీళ్ళలో కరిగివున్న పదార్థాలు ఎక్కువయ్యేకొద్దీ నీటి సాంద్రణ తక్కువ అవుతుంది. సాధారణంగా రక్తంలోనూ, రక్తనాళాల కణాల్లోనూ నీటి సాంద్రణ సమానంగా ఉంటుంది. రక్తంలో ఉప్పు గానీ గ్లూకోజ్‌ గానీ ఎక్కువగా ఉంటే రక్తంలో నీటి సాంద్రణ పడిపోయి రక్తనాళాల కణాల నుంచి నీరు రక్తంలోకి వస్తుంది. దాంతో రక్తం పరిమాణం పెరుగుతుంది. బీపీ ఎక్కువవుతుంది. అందువల్ల ఆహారంలో ఉప్పు గానీ, గ్లూకోజ్‌ గానీ, నీటిలో కరిగిపోయే అలాంటి పదార్థం ఏదైనా గానీ మితిమీరి తింటే బీపీ పెరుగుతుంది. అందువల్లే చక్కెర ఎక్కువగా ఉండే సాఫ్ట్‌ డ్రింక్స్‌ తాగడం వల్ల షుగర్‌ జబ్బు రావడమే గాక, బీపీ ఎక్కువ కావడం కూడా జరగవచ్చు. ఉప్పు ఎక్కువైతే బీపీ రావడానికి కారణం కూడా ఇదే.
 
గ్యాస్‌ ట్రబుల్‌ ఎందుకొస్తుంది? 
ఇవాళ షుగరూ బీపీలతో పోటీ పడుతున్న మరో జబ్బు గ్యాస్‌ ట్రబుల్‌. పొట్ట ఉబ్బడం, నొప్పి రావడం, గ్యాస్‌ వదలడం, విరోచనాలు, మొదలైన లక్షణాలున్న వారికి గ్యాస్‌ ట్రబుల్‌ ఉంది అని చెప్తున్నారు డాక్టర్లు. ఈగ్యాస్ ఎక్కడనుంచి వస్తుంది, ఎందుకొస్తుంది. ఈ జబ్బుకు చికిత్స చేయడం వీలవుతుందా, రాకుండా ఉండడానికి మనం చెయ్యగలది ఏదైనా ఉందా? ఇవీ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. 
 
మన శరీరంలో ఎన్ని జీవకణాలున్నాయో కచ్చితంగా ఎవ్వరికీ తెలియదు. నలభై లక్షల కోట్లు ఉంటాయని ఒక అంచనా ఉంది. ఇవి గాక, వీటికి పది రెట్లు, అంటే నాలుగు వందల లక్షల కోట్ల సూక్ష్మక్రిములు మన శరీరం మీదా, లోపలా నివాసం ఏర్పరచుకుని ఉంటాయి. అంటే నిజానికి మనం 10 శాతం మాత్రమే మనుషులం; మిగతా 90 శాతం సూక్ష్మక్రిములం. అయితే అదృష్టం కొద్దీ మన కణాలు సూక్ష్మక్రిముల కణాల కంటే దాదాపు వెయ్యి రెట్లు పెద్దవి. కాబట్టి సంఖ్యాపరంగా అవే ఎక్కువగా ఉన్నా బరువు లెక్కన గానీ, ఘన పరిమాణంలో గానీ మన శరీరంలో 99 శాతం మనం, 1 శాతం మాత్రమే సూక్ష్మక్రిములు ఉన్నాయి. ఈ సూక్ష్మక్రిములు చర్మం మీదా, నవరంధ్రాల్లోనూ ఉంటాయి. బహుశా వీటిలో ఎక్కువ భాగం ఆహార నాళంలో ఉంటాయి. అంటే నోటి నుండి మలద్వారం దాకా మనలోగుండా పోయే రంధ్రంలో. ఇందులో దాదాపు నాలుగు వందల రకాల సూక్ష్మక్రిములు ఉంటాయని ఒక అంచనా. అయితే ఈ క్రిముల వల్ల మనకు జబ్బులు రావు. నిజానికి చిన్న పేగులో నివాసం ఉంటున్న కొన్ని క్రిములు మనకు అవసరం అయిన విటమిన్లను సరఫరా చేస్తాయి కూడా. మరి వాటికి మనం తిండి పెడుతున్నాం కదా! ఆ మాత్రం సహాయం చెయ్యకపోతే ఎలా?
 
ఇంకో విషయం... ఈ క్రిములు లేకపోతే, లేక ఏదో కారణంగా వీటి సంఖ్య తగ్గిపోతే, ఇతర క్రిములు వీటి స్థానాన్ని ఆక్రమించవచ్చు. అవి మనకు హాని కలిగించవచ్చు. అయితే ఈ సూక్ష్మక్రిములతో ఒక తిరకాసుంది. మన జీవకణాలు గ్లూకోజ్‌ నుంచి శక్తిని బయటకు లాగేటపుడు బొగ్గుపులుసు వాయువును తయారు చేస్తాయి. అలాగే సూక్ష్మక్రిముల్లో కొన్ని రకరకాల ఇతర వాయువులను తయారు చేస్తాయి. ఈ వాయువుల వల్లే మనకు పొట్ట ఉబ్బడం, నొప్పి పుట్టడం, ఇందాక చెప్పుకున్న ఇతర లక్షణాలూ వస్తాయి. కొన్ని రకాల ఆహారాల నుంచి వాయువు ఎక్కువగా తయారవుతుంది. ఉదాహరణకు శనగలు, చిక్కుళ్ళు. కొందరి విషయంలో పాలు కూడా గ్యాస్‌ను పెంచుతాయి. ఏ ఆహారం వల్ల గ్యాస్‌ ట్రబుల్‌ ఎక్కువవుతుందో అది ఎవరికి వారే గమనించుకోవాలి. ఆ ఆహారాలను వాడకుండానో లేదా మితంగా వాడుతూనో ఉంటే గ్యాస్‌ ట్రబుల్‌ను కంట్రోల్లో ఉంచవచ్చు. నిజానికి సూక్ష్మక్రిములు అన్నిచోట్లా ఉంటాయి. గాలిలో ఉంటాయి, నీళ్ళల్లో ఉంటాయి. అవి లేనిచోటు లేదు. గ్యాస్‌ ట్రబుల్‌ మాత్రమే కాదు, మనకు వచ్చే చాలా వ్యాధులు సూక్ష్మక్రిముల ద్వారానే వస్తాయి.
 
జబ్బులు రాకుండా చూసుకోవాలంటే అందరూ చెయ్యగల పనులు కొన్ని ఉన్నాయి.
- మల విసర్జన చేయగానే చేతులు శుభ్రంగా సబ్బు నీళ్ళతో కడుక్కోవాలి. 
- శుభ్రంగా లేని చేతుల్తో వంట చెయ్యకూడదు. 
- పాలు వాడే ముందు బాగా కాగబెట్టాలి. 
- కూరగాయలు శుభ్రంగా కడిగి వాడుకోవాలి. 
- చెడిపోయిన పళ్ళు గానీ, వంటలు గానీ తినకూడదు. 
- వంట పాత్రలు శుభ్రంగా కడుక్కోవాలి. 
మీరు తాగే నీరూ, వంటకీ, పాత్రలు శుభ్రం చెయ్యడానికీ వాడే నీరూ, మీరు పీల్చే గాలీ ఆరోగ్యపరంగా చాలా ముఖ్యమైన సంపదలు. వీటిని శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధి నివారణ సులభం అవుతుంది. అలాగే ఇంటిచుట్టూ మురికి నీరు నిలబడకుండా చూసుకోవాలి. పెంటకుప్పలు లేకుండా చూసుకోవాలి. మన దేశంలో మంచినీటి సరఫరా లేదు. కుళాయి తిప్పగానే నీళ్ళొచ్చే చోట కూడా ఆ నీరు శుభ్రమైనదని చెప్పలేం. చెరువుల నుంచి, నదుల నుంచి సరఫరా చేసే నీటిని ఒక ప్రణాళిక ప్రకారం శుభ్రం చేసి సరఫరా చేస్తున్నారో లేదో చెప్పలేం. అందువల్ల మనం వాడుకునే నీటిని బాగా మరగబెట్టి, శుభ్రమైన గుడ్డతో వడబోసి అప్పుడు వాడుకోవడం మంచిది. (ఈ శీర్షిక ఇంతటితో సమాప్తం) - ఆరి సీతారామయ్య, [email protected]