అమ్మంటే హడల్‌.. ఏం చేయాలి?

  25-01-12
 
నాకు పెళ్లయి 15 సంవత్సరాలైంది. ఇద్దరు పిల్లలు. అబ్బాయి టెన్త్‌, అమ్మాయి 8వ తరగతి చదువుతున్నారు. మా అబ్బాయి చదువులో కొంత వెనకబడ్డాడు. కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్‌ మార్కులు వస్తున్నాయి. ఈ విషయమై మా ఆవిడ విపరీతంగా బాధపడుతోంది. రోజూ వాడిని చదివించడానికి నానా తంటాలు పడుతుంది. వాణ్ని చితకబాదుతుంది. అయినా వాడికి చదివేది బుర్రకెక్కడం లేదు. దీంతో ప్రతిరోజు మా ఆవిడ వాడిని కొట్టడమో, తిట్టడమో చేయకుండా ఉండదు. వాళ్ల అమ్మను చూస్తేనే వాడు వణికిపోతున్నాడు. ఆమెకు రాను రాను కోపం పెరిగిపోతోంది. వాడిని విరోధిని చూసినట్లు చూస్తోంది. తోటి విద్యార్థులకు వీడికన్నా మంచి మార్కులు వస్తే ఆ రోజు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది. వాడిని శాపనార్థాలు పెడుతుంది. అప్పటికీ నేను సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఆమెలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఆమె బాధ భరించలేక మా అబ్బాయి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనని భయపడుతున్నాను. మా ఆవిడ ప్రవర్తనలో మార్పు ఎలా తీసుకురావాలో దయచేసి సలహా ఇవ్వండి.
-రామచంద్ర, తిరుపతి.
చదువుల విషయంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. పిల్లల చదువు విషయంలో వారు తీసుకునే అతిశ్రద్ధ ఒక్కోసారి అనర్థాలకు కూడా దారితీస్తుంది. ఒకే వయసు ఉన్న పిల్లలందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఉండవు. తాము ఆశించిన ఫలితాలు పిల్లల నుంచి పొందాలనుకోవడం అత్యాశే అవుతుంది. పిల్లలను భయపెట్టడం, కొట్టడం, ఒత్తిడి తీసుకురావడం వల్ల వారు బాగా చదువుతారని, మంచి మార్కులు సాధించగలరని అనుకోవడం పొరపాటు. వారి తెలివితేటలకు తగ్గట్టే మార్కులు వస్తున్నందుకు సంతోషించాలి. వారికి తగిన గుర్తింపును, ప్రోత్సాహాన్ని ఇవ్వాలే తప్ప ఇంకా మంచి మార్కులు సాధించనందుకు దండించడం వల్ల ప్రయోజనం ఉండదు. పిల్లలపై అతిగా ఒత్తిడి తీసుకురావడం వల్ల వారికి చదువుపై అయిష్టత ఏర్పడే అవకాశం ఉంది. వారికి జీవితంపై విరక్తి కలిగేందుకు కూడా ఈ చర్యలు దారితీసే ప్రమాదం ఉంది. జీవించడానికి చదువు అవసరమేగాని చదువే జీవితం కాదు. చదువు లేని వారు, చదువులో వెనుకబడినవారు ఎందరో జీవితంలో విజయాలు సాధించారు. మీ ఆవిడ ఆలోచనా విధానంలో మార్పు రావలసిన అవసరం ఉంది. మీ ఆవిడను, మీ అబ్బాయిని తీసుకుని ఒక క్లినికల్‌ సైకాలిజిస్టును కలవండి. వారిలో మార్పు కనిపిస్తుంది.
 
 
నాకు పెళ్లయి ఆరేళ్లయింది. ఇంతవరకు పిల్లలు కలగలేదు. మా వారు వ్యాపారం చేస్తారు. మాది ఉమ్మడి కుటుంబం. అత్త, మామ, మరిది, తోడికోడలు అందరం ఒకటే ఇంట్లో ఉంటాము. తోడికోడలుకు పెళ్లయిన ఏడాదికే బాబు పుట్టాడు. పిల్లల కోసం కొన్నేళ్లుగా డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాము. మీ ఇద్దరిలో ఎటువంటి లోపం లేదు..పిల్లలు పుడతారని డాక్టర్లు అంటున్నారే కాని ఎటువంటి ఫలితం మాత్రం లేదు. రోజురోజుకు నాకు జీవితంపై విరక్తి ఏర్పడుతోంది. ఏ పనీ చేయబుద్ధి కావడం లేదు. ఉత్సాహం పూర్తిగా పోయింది. మా ఆయనేమో పిల్లల గురించి దిగులు పడవద్దని అంటారే కాని నాకు మాత్రం ఇక బతకాలన్న కోరిక చచ్చిపోతోంది. ఇంట్లో ఇందరు ఉన్నా నాకు మాత్రం ఒంటరితనం ఆవహించినట్లు ఉంటుంది. ఎవరూ ఏమీ అనకపోయినా నాకే ఆత్మన్యూనతగా ఉంటోంది. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి.
-కవిత, మహబూబ్‌నగర్‌
పెళ్లయిన ఒకటి రెండు సంవత్సరాలలోపు పిల్లలు పుట్టకపోతే చాలామంది ముఖ్యంగా స్త్రీలు చాలా ఆవేదన చెందుతున్నారు. సంతానలేమికి ఆడవారే కారణమన్న అపోహ కూడా సమాజంలో ఉంది. లోపం ఎవరిలో ఉన్నా ఎక్కువ మానసిక క్షోభను మాత్రం స్ర్తీలే అనుభవిస్తున్నారు. మీ విషయానికి వస్తే పిల్లలు కలగకపోవడానికి మీలో శారీరక లోపాలు ఏవీ లేవని డాక్టర్లు నిర్ధారించారు కాబట్టి మీరు అంతగా దిగులు పడాల్సిన అవసరం లేదు. 35-39 మధ్య వయస్కులు కూడా గర్భం ధరించిన వారు ఉన్నారు. పిల్లలు లేరని దిగులు పడుతూ ఉంటే తద్వారా మీ శరీరంలో కలిగే భౌతిక, రసాయనిక మార్పులు సంతానోత్పత్తికి అవరోధం కలిగించే అవకాశం ఉంది. దీనివల్ల మీకు డిప్రెషన్‌ ఎక్కువవుతుంది. మీ ఆలోచనా విధానం, అనుభవించే భావోద్వేగాలు అండం విడుదలపై ప్రభావం చూపుతాయి. మీ మనసులో బాధపడడం వల్ల దిగులు ఎక్కువవుతుంది. మీ భర్తతో మనసు విప్పి మాట్లాడండి. ఆయన ఓదార్పు వల్ల మీ మనసు తేలికపడుతుంది. అంతేకాకుండా ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోండి. దీంతో జీవితంపై మమకారం ఏర్పడుతుంది. అప్పటికీ మీ దిగులు తగ్గకపోతే ఒక మానసిక వైద్యుడిని సంప్రదించండి. మీకు తగిన సలహాలు ఇస్తారు.
 
 
డాక్టర్‌ ఎస్‌. భాస్కర్‌ నాయుడు
ప్రొఫెసర్‌ ఆఫ్‌ క్లినికల్‌ సైకాలజీ
రోషినీ కౌన్సిలింగ్‌ సెంటర్‌,
326, సెకండ్‌ లేన్‌ టు గ్రాండ్‌ కాకతీయ హోటల్‌,             బేగంపేట్‌, హైదరాబాద్‌.