అలసటగా ఉందా? అనీమియా ఏమో!

ఆంధ్రజ్యోతి(11-10-2016): ఏ చిన్న పనిచేసినా అసటగా ఉండడం, అయినదానికీ, కానిదానికీ అసహనానికి గురికావడం వంటి లక్షణాలు కొందరిలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి రక్తహీనత వల్ల వచ్చే అనీమియా లక్షణాలు కావచ్చు. వీటితో పాటు శక్తిహీనత, మనసు దేనిమీదా లగ్నం కాకపోవడం, శ్వాసలో ఆయాసం, లైంగిక సామర్థ్యం తగ్గడం, మగతగా ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇవి కూడా అనీమియా సంబంధిత లక్షణాలే. సాధారణంగా, రక్తంలో హీమోగ్లోబలిన్‌ తగ్గినప్పుడే ఈ సమస్య తలెత్తుతుంది. ఎర్ర రక్తకణాల్లో ఉండే ఈ ప్రొటీన్‌ ఆక్సీజన్‌ను సంగ్రహించి శరీరమంతా ప్రసరింపచేస్తుంది.
 
ఈ సమస్య ఎక్కువగా వయసు పైబడిన దశలోనే మొదలవుతుంది. అయితే చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఒక సాధారణ రక్తపరీక్ష ద్వారా రక్తంలో ఉండే ఈ తేడాలు తెలుస్తాయి. కొన్ని ప్రత్యే సందర్భాల్లో మరికొన్ని ఇతర పరీక్షలు కూడా అవసరమవుతాయి. ప్రత్యేకించి పోషకాహార లోపాలతో వచ్చే ఐరన్‌ డెఫిషియెన్సీ అనీమియా, విటమిన్‌ బి-12 లోపాలతో వచ్చే పెర్నీసియస్‌ అనీమియా, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, కిడ్నీ జబ్బుల కారణంగా వచ్చే క్రానిక్‌ అనీమియా వంటి సమస్యలు ఉన్నప్పుడు ఏమాత్రం ఉపేక్షించకుండా అవసరమైన వైద్య చికిత్సలు వెంటనే తీసుకోవడం చాలా అవసరం.