కేన్సర్‌ చికిత్స దుష్ప్రభావాలను తగ్గించేందుకు కొత్తవిధానం

18-08-2019: కేన్సర్‌ రోగులకు అందించే ఫొటోడైనమిక్‌ చికిత్సలో వారిపై చూపించే తీవ్ర దుష్ప్రభావాల్ని తగ్గించే సరికొత్త విధానాన్ని బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫొటోడైనమిక్‌ చికిత్సలో కాంతి ప్రసరణ ద్వారా కేన్సర్‌ కణాలను నాశనం చేసే మందులను వినియోగిస్తారు. అయితే.. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవే కాక, రోగులపై తీవ్ర దుష్ప్రభావాల్ని చూపిస్తాయి. తాము కనిపెట్టిన తాజా విధానంలో కర్బణ సూక్ష్మఅణువుల సాయంతో కేన్సర్‌ మందులను కణాలకు చేర్చవచ్చని, ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన జోస్‌ రికార్డో తెలిపారు. ఈ సూక్ష్మఅణువులను ప్రాకృతికంగా లభించే పదార్థాలనుంచి తీసుకోవడం వలన ఖర్చు, దుష్ప్రభావాలు బాగా తగ్గడమే కాక.. కేన్సర్‌ కణాలు మరింత వేగంగా అంతమవుతున్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు.