ఇల్లు శుభ్రానికి ఇవి రోజూ చేయాలి..

ఆంధ్రజ్యోతి (14-11-2019): ఇంట్లో కొన్నింటిని మాత్రం నిత్యం శుభ్రం చేసుకోవాలి. లేకపోతే వాటివల్ల ఎంతో చిరాకు కలుగుతుంది. అనారోగ్యం పాలవుతాం కూడా. ఆఫీసులకు వెళ్లేవారు సైతం వేగంగా ఈ టిప్స్‌ను పాటిస్తే ఇంటికి రాగానే వాళ్లకి హాయిగా అనిపిస్తుంది. అవేమిటంటే...

సోఫాసెట్‌, టీపాయ్‌లను నిత్యం వాటిపై పేరుకున్న దుమ్మును దులపాలి.
 
ఫ్లోర్‌ క్లీనింగ్‌ రోజూ చేయాలి. ఇంట్లో కిటికీలు, తలుపులు తెరిచి ఉంచుతాం. బయట దుమ్ము ఇంట్లోకి వచ్చి చేరుతుంది. ఈ దుమ్ము, ధూళి తినే పదార్థాలపై పడితే అనారోగ్యం పాలవుతాం. అందుకే ఫ్లోర్‌ క్లీనింగ్‌ నిత్యం చేసుకోవాలి.
 
వంటకు వాడిన గిన్నెలను పది పన్నెండు గంటల లోపు తోమాలి. లేకపోతే అవి వాసన వస్తాయి. దీనివల్ల ఇంటి సభ్యులు అనారోగ్యం పాలవుతారు.
 
ప్రతిరోజూ శుభ్రం చేయాల్సిన వాటిల్లో సింక్‌ ఒకటి. సింక్‌ క్లీన్‌గా ఉంటే పాత్రలు కూడా శుభ్రంగా ఉంటాయి.
 
ఖరీదైన డీవీడీ ప్లేయర్లు, కంప్యూటర్లు, టీవీలు ఇతర ఎలక్ర్టానిక్‌ వస్తువులను ప్రతిరోజూ శుభ్రపరచాలి. వాటిపై దుమ్ము పేరుకోదు. దాంతో దుమ్ము వల్ల వచ్చే ఎలర్జీల బాధలూ ఉండవు.
 
రోజూ వాడే వాటిల్లో డైనింగ్‌ టేబుల్‌ ఒకటి. దీనిని తడిగుడ్డతో శుభ్రంగా ఎప్పటికప్పుడు తుడవాలి. ఇలా చేయడం వల్ల టేబుల్‌ క్లీన్‌గా ఉండడంతో పాటు టేబుల్‌పై పడ్డ కూర, పచ్చళ్లు, పులుసుల మచ్చలు ఉండవు.
 
వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలంటే ఆ గదిలో శుభ్రమైన టవల్స్‌, స్పాంజ్‌లను ఉంచాలి. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్‌గా, శుభ్రంగా ఉంచాలి. వంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటే కుటుంబసభ్యుల ఆరోగ్యం అంత బాగా ఉందని లెక్క. ముఖ్యంగా వంటింట్లోని కూరగాయలు, ఇతర చెత్తను పొడి, తడి చెత్తలుగా వేరు చేసి ఆ బాస్కెట్లను బాల్కనీలో పెట్టాలి.
 
వంట పూర్తయిన వెంటనే స్టవ్‌తో పాటు వంటింటి గట్టు కూడా శుభ్రంగా సర్ఫుతో కడగాలి. ఇలా చేయడం వల్ల వంట పదార్థాల తాలూకు జిడ్డు, నూనె మరకలు కనిపించవు. గట్టు పరిశుభ్రంగా లేకపోతే వండుకున్న పదార్థాలు కూడా శుభ్రంగా ఉండవు.
 
కూరగాయలు కోసే చాకులు, ఛాపింగ్‌బోర్డులను నిత్యం శుభ్రం చేయాలి.
 
బెడ్‌ కూడా శుభ్రంగా ఉండాలి. లేకపోతే నిద్ర సరిగా పట్టదు. వీలుంటే రోజూ బెడ్‌పై దుప్పటి మార్చాలి. లేదా పడుకోబోయేముందు పక్కను, దుప్పట్లను బాగా దులపాలి. కనీసం మూడు రోజులకొకసారి బెడ్‌ మీద దుప్పట్లను, దిండు కవర్లను, కప్పుకునే బెడ్‌షీట్లను మారుస్తుండాలి.