క్షణాల్లో గుండె జబ్బులను కనిపెట్టొచ్చు

పరికరాన్ని రూపొందించిన ఐఐటీ-హెచ్‌

20-08-2019: ఓ వ్యక్తికి గుండె జబ్బు వచ్చే అవకాశముందా? ఒక్క చుక్క రక్తంతో భవిష్యత్‌లో వచ్చే గుండె సంబంధిత వ్యాధులను ముందే పసిగట్టొచ్చా? అంటే అవుననే అంటున్నారు ఐఐటీ-హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు కచ్చితత్వంతో ఈ విషయాలను నిర్ధారించే పరికరాలు లేవు. తాము మొట్టమొదటిసారిగా అత్యంత వేగంగా, కచ్చితత్వంతో ఫలితాన్నిచ్చే పరికరాన్ని కనుగొన్నామని ఐఐటీ-హెచ్‌ తరఫున పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ రేణుజాన్‌ వెల్లడించారు. శరీర అవయవాల్లో ఉండే బయోమార్కర్స్‌ ద్వారా భవిష్యత్‌లో రాబోయే వ్యాధులను కనుక్కోవచ్చని చెబుతున్నారు. 

‘‘బయోమార్కర్స్‌ అంటే శరీరంలో విడుదలయ్యే కొన్ని రసాయనాలు. వీటిని గమనిస్తే.. శరీర అవయవాల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. గుండెకు సంబంధించిన బయోమార్కర్‌ను కార్డియాక్‌ ట్రోపోనిన్స్‌ లేదా సీటీఎన్‌ఎస్‌ అంటారు. కొన్ని ప్రత్యేక సెన్సర్ల ద్వారా ఈ బయోమార్కర్లను పరిశీలించినప్పుడు.. గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సెన్సర్ల కచ్చితత్వం తక్కువే. కొన్ని సందర్భాల్లో అవి తప్పుడు నివేదికలు ఇచ్చే ప్రమాదముంది. మేం తయారు చేసిన పరికరంలోని సెన్సర్లు అత్యంత కచ్చితత్వంతో ఫలితాలనిస్తాయి. ఈ పరికరం ద్వారా అతి తక్కువ పరిమాణంలో రక్తాన్ని తీసుకొని.. దాని ద్వారా గుండె జబ్బులను.. ఆయా వ్యాధులు వచ్చే సూచనలను కనుగొనవచ్చు’’ అని ఆయన వివరించారు. తమ పరికరంలో కచ్చితత్వం ఎక్కువగా ఉందని తేలిందని ఆయన వివరించారు.