వైట్‌హెడ్స్‌ తొలగించేందుకు..

ఆంధ్రజ్యోతి: ముక్కుకి ఇరువైపులా, బుగ్గల మీద, గడ్డం ప్రాంతాల్లో పుట్టుకొచ్చే వైట్‌హెడ్స్‌ని తొలగించుకునేందుకు, వాటిని రాకుండా నివారించేందుకు కొన్ని సౌందర్య చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే వైట్‌హెడ్స్‌ మిమ్మల్ని మళ్లీ మళ్లీ పలకరించకుండా జాగ్రత్తపడొచ్చు.
 
 ముఖానికి ఆవిరి పడితే చర్మ రంధ్రాలు తెరుచుకుని వాటిలో చేరిన మురికి, బ్యాక్టీరియాల్ని సులభంగా తొలగించేయొచ్చు.  వెడల్పాటి గిన్నెలో వేడినీళ్లు పోసి ఆ గిన్నె మీద ముఖాన్ని ఉంచాలి. ఆవిరి బయటికి పోకుండా తలను పెద్ద తుండుతో కప్పేసి పావుగంట పాటు ముఖాన్ని ఆవిరికి ఉంచాలి. ఇలా చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే మరో పద్ధతి కూడా ఉంది. శుభ్రమైన తుండును వేడి నీళ్లలో ముంచి కూడా వాడొచ్చు. వేడి నీళ్లలో ముంచిన తుండును బాగా పిండి ముఖంపై కప్పుకోవాలి. అది చల్లారాక మళ్లీ వేడినీళ్లలో తుండును ముంచి ముఖం మీద వేసుకోవాలి. ఇలా పావుగంట చేయాలి. 

ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. కనుక ఈ ప్రక్రియ తరువాత సాల్సిలిక్‌ యాసిడ్‌ ఉన్న ఫేస్‌ వాష్‌ వాడాలి. ఇది రంధ్రాలను శుభ్రం చేసి దుమ్ము, బ్యాక్టీరియాలను తొలగిస్తుంది. ఆ తరువాత ముఖాన్ని చల్లటి నీళ్లతో రెండు నిమిషాల సేపు కడిగితే రంధ్రాలు మూసుకుపోతాయి.

చర్మం పిహెచ్‌ బ్యాలెన్స్‌ను బేకింగ్‌ సోడా సరిగా ఉంచుతుంది. అలాగే చర్మం మీది మృతకణాలను తొలగించడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఒక టేబుల్‌స్పూన్‌ బేకింగ్‌ సోడాలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై సున్నితంగా కొన్ని సెకన్ల పాటు రుద్దాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం చాలా లోతుగా శుభ్రమై వైట్‌హెడ్స్‌ పోతాయి. యాక్నె సమస్య కూడా ఉండదు.

ఓట్‌మీల్‌, పంచదారలను ఒక్కోటి అరకప్పు చొప్పున తీసుకుని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పట్టాలి. ఈ పొడిని శుభ్రమైన సీసాలో నిల్వచేసుకుని స్క్రబ్‌లా వాడుకోవచ్చు. రెండు టేబుల్‌ స్పూన్ల స్క్రబ్‌లో ఒక టేబుల్‌ స్పూను నిమ్మరసం లేదా కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను వైట్‌హెడ్స్‌ ఉన్న ప్రాంతంలో పూసి సున్నితంగా ఐదు నిమిషాలు రుద్ది తరువాత చల్లటి నీళ్లతో కడగాలి. ఇలా వారంలో రెండు మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

యాపిల్‌సైడర్‌ వెనిగర్‌ మంచి ఆస్ర్టింజెంట్‌. చర్మంపై అధిక నూనెని తొలగిస్తుంది. అంతేకాదు యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు కూడా ఉన్నాయి. ఒక టేబుల్‌స్పూన్‌ వెనిగర్‌లో ఒక టేబుల్‌ స్పూన్‌ నీళ్లు కలపాలి. ఈ ద్రవంలో దూది ముంచి ముఖమంతా రాసుకోవాలి. పదినిమిషాల తరువాత మామూలు నీళ్లతో కడిగేయలి.,, యాపిల్‌ సైడ్‌ వెనిగర్‌ను ఫేస్‌ ప్యాక్‌లో కూడా వాడొచ్చు.

దాల్చిన చెక్కలో పునరుత్పత్తి గుణాలు మెండుగా ఉన్నాయి. ఇందులోని యాంటీమైక్రోబయల్‌ గుణాల వల్ల మృతకణాలు, బ్యాక్టీరియా, యాక్నెలను నివారించొచ్చు. రక్త ప్రసరణ మెరుగుపడి చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. దాల్చిన పొడిని స్క్రబ్‌గా లేదా ఫేస్‌ప్యాక్‌గా వాడొచ్చు.

ఒక టేబుల్‌స్పూన్‌ దాల్చినచెక్క పొడిలో ఒక టేబుల్‌ స్పూన్‌ ఓట్‌మీల్‌ పొడి, ఒకటి లేదా రెండు టేబుల్‌ స్పూన్ల తేనె తీసుకుని ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పేస్ట్‌లా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖంపై పూసుకుని పదినిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. దాల్చినచెక్క గాఢంగా ఉంటుంది. కాబట్టి చర్మం మీద రాసుకున్నప్పుడు మండినట్టు అనిపిస్తుంది. మరీ సున్నితమైన చర్మం అయితే ఈ ప్యాకకు దూరంగా ఉండాలి. ఈ ప్యాక్‌ వేసుకునే ముందు ప్యాచ్‌ టెస్ట్‌ తప్పనిసరి.