వంటింట్లో సౌందర్యం

ఆంధ్రజ్యోతి: చర్మం, వెంట్రుకల ఆరోగ్యం కోసం ఖరీదైన సౌందర్య ఉత్పత్తులే వాడాలనే నియమేమీ లేదు. అంతే సమానమైన ఫలితాలనిచ్చే వస్తువులు మన వంటింట్లోనే దొరుకుతాయి. తాజా పళ్లు, కూరగాయలు ఉపయోగించి అందానికి మెరుగులు దిద్దుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

స్కిన్‌ టోనర్‌
అర కప్పు దోస గుజ్జుకు పావు కప్పు వోడ్కా కలపాలి. దీన్లో దూదిని ముంచి ముఖంపై అద్దుకుని అది ఆరాక కడిగేసుకోవాలి.  

 

పట్టుకుచ్చులాంటి జుట్టు కోసం...
వెంట్రుకలకు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి ఆవిరి పట్టి 45 నిమిషాలపాటు వదిలేయాలి. ఆ తర్వాత నీరు ఓడ్చిన పెరుగు (ఈ పెరుగైతే వెంట్రుకల నుంచి కారిపోకుండా ఉంటుంది), ఒక గుడ్డు బాగా కలపాలి. దీన్ని వెంట్రుకలకు పట్టించి వెంట్రుకలను కవర్‌ చేస్తూ క్యాప్‌ పెట్టుకుని 45 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కండిషనర్‌ వాడకూడదు. తలస్నానం తర్వాత డ్రయర్‌ ఉపయోగించకుండా జుట్టును సహజంగా ఆరనివ్వాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మృదువుగా మారుతుంది. 

 

బాహుమూలల్లో నలుపు తగ్గాలంటే...
నిమ్మరసం (విటమిన్‌ సి పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది), పసుపు (యాంటీఫంగల్‌ గుణాలు కలిగి ఉండటం మూలంగా బాహుమూలల్లో దుర్గంధాన్ని నివారిస్తుంది), గంధం నూనెలను కలిపి రాత్రి పడుకునే ముందు బాహుమూలల్లో అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి. 
చర్మం నునుపుదేలాలంటే...
ఒక కప్పు మినరల్‌ వాటర్‌లో అంతే పరిమాణంలో ఓట్స్‌ కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని చర్మానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
హోమ్‌మేడ్‌ క్లీన్సర్‌
ఒక టేబుల్‌స్పూను తేనె, ఒక టేబుల్‌ స్పూను నిమ్మరసం, అరకప్పు డిస్టిల్డ్‌ వాటర్‌, ఒక టేబుల్‌స్పూను బ్రౌన్‌ షుగర్‌, ఒక టేబుల్‌స్పూను గ్లిసరిన్‌లను కలిపితే హోమ్‌మేడ్‌ క్లీన్సర్‌ తయారైనట్టే! మేకప్‌ తొలగించటానికి ఉపయోగించాలనుకుంటే దీన్లో గ్లిసరిన్‌ పరిమాణం పెంచాలి. అలాగే చర్మపు జిడ్డుతత్వాన్ని బట్టి క్లీన్సర్‌లో గ్లిసరిన్‌ పరిమాణాన్ని పెంచటం, తగ్గించటం చేయాలి.
 మృత కణాలు తొలగించాలంటే...
బొప్పాయి, పైనాపిల్‌ పళ్లలోని ఎంజైమ్స్‌ చర్మం మీది మృత కణాలను సమర్థవంతంగా తొలగిస్తాయి. కాబట్టి సమ పరిమాణాల్లో బొప్పాయి, పైనాపిల్‌ ముక్కలు తీసుకుని అంతే సమానంగా సముద్రపు ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి. దీన్ని స్క్రబ్‌గా ఉపయోగిస్తే చర్మం మీది మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతులీనుతుంది.