హోమ్‌మేడ్‌ స్క్రబ్స్‌

చర్మాన్ని మెరిపిస్తాయి! 

27-08-2019: చర్మం తాజాగా, అందంగా కనిపించాలంటే సౌందర్య సాధనాలతో పాటు మృతకణాలను తొలగించడం మరవొద్దు. అయితే చర్మం మీది మృతకణాలు ఒకపట్టాన పోవు. అవి ఎక్కువ రోజులు చర్మం మీద ఉండడం వల్ల స్వేదగ్రంథులు మూసుకుపోవడం, జుట్టు రాలడం, చర్మం మీద పగుళ్లు వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగనీ శరీరంలో వివిధ చోట్ల పేరుకున్న మృతకణాలను తొలగించేందుకు ఒకే విధానం సరికాదు. సులభంగా ఇంటివద్దనే తయారుచేసుకున్న స్క్రబ్‌లతో మాడు ముఖం, పెదాలు, పాదాల మీది డెడ్‌సెల్స్‌ను మాయం చేయొచ్చు. అదెలాగంటే... 

మాడు: జట్టుకు షాంపూ పట్టించి చేతులతో వలయాకారంలో మసాజ్‌ చేయాలి. దీంతో మాడు భాగంలోని మృతకణాలు తొలగిపోతాయి. కుదుళ్లకు రక్తసరఫరా సవ్యంగా జరుగుతుంది. చుండ్రు తగ్గుతుంది. ఫలితంగా వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుంది. తరువాత ‘స్కాల్ప్‌ స్క్రబ్‌’ రాసుకోవాలి.
 
స్కాల్ప్‌ స్క్రబ్‌: రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పును బ్రౌన్‌ షుగర్‌, ఓట్‌మీల్‌, కండీషనర్‌ తీసుకోవాలి. వీటిని మిశ్రమంగా కలపాలి. తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. దీంతో మురికి, నూనెలు, వదులుతాయి. ఇప్పుడు ‘స్కాల్ప్‌ స్క్రబ్‌’ను కేశాలకు రుద్ది, వలయాకారంలో మసాజ్‌ చేయాలి. కొద్దిసేపటికి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి.
 
ముఖం: మృతకణాలను తొలగించేందుకు వారంలో ఒకసారి లేదా రెండుసార్లు ముఖానికి ‘ఫేషియల్‌ స్క్రబ్‌’ వాడాలి. ఇలా చేయడం ద్వారా చర్మగ్రంథుల్లో చేరిన దుమ్ము ధూళి బయటకు వస్తుంది. చర్మ కణాలను రక్తసరఫరా పెరిగి, ఆరోగ్యంగా ఉంటాయి. ముఖాన్ని మెరిపించాలంటే ఫేషియల్‌ స్క్రబ్‌ తప్పనిసరి.

ఫేషియల్‌ స్క్రబ్‌: టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనెలో రెండు టేబుల్‌ స్పూన్ల చక్కెర వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి వలయాకారంలో ముఖానికి రాసుకోవాలి. నిమిషం పాటు మఖం మొత్తం మసాజ్‌ చేయాలి.

పెదాలు: చల్లని వాతవరణం, సన్‌బర్న్‌ వల్ల పెదాల మీద మృతకణాలు కనిపిస్తాయి. వాటిని పోగొట్టేందుకు లిప్‌స్క్రబ్‌ ఉపయోగిస్తారు. కానీ అవి పూర్తిగా వదలవు. పుదీనాతో చేసిన లిప్‌ స్క్రబ్‌తో అధరాలను అందంగా తీరిదిద్దుకోవచ్చు.

మింట్‌ లిప్‌స్క్రబ్‌: రెండు టేబుల్‌ స్పూన్ల చక్కెర, టేబుల్‌ స్పూన్‌ తేనె, టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ నూనె, ఒక చుక్క పుదీనా నూనెను చక్కగా మిక్స్‌ చేస్తే మింట్‌ లిప్‌స్క్రబ్‌ రెడీ. వేడినీళ్లలో ముంచిన వస్త్రాన్ని పెదాల మీద 5 నిమిషాలు ఉంచాలి. తరువాత స్క్రబ్‌ను పెదాల మీద మందంగా రుద్దాలి. 5 నిమిషాలయ్యాక పొడివస్త్రంతో తుడిచేయాలి. వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

పాదాలు: వీటి మీది చర్మం తొందరగా గరుకుగా, పొడిగా మారే అవకాశం ఎక్కువ. తరచుగా ఫూట్‌ స్క్రబ్‌ ఉపయోగించడం వల్ల పాదాలను ఆరోగ్యంగా ఉంటాయు. పాదాలకు రాత్రిపూట మాయిశ్చరైజర్‌ రాసుకొని, పలుచని సాక్సులు వేసుకోవాలి. ఇలాచేస్తే చర్మానికి తేమ అంది, సున్నితంగా మారుతుంది.
 
ఫూట్‌ స్క్రబ్‌: రెండు కప్పుల బ్రౌన్‌ షుగర్‌, సగం కప్పు కొబ్బరినూనె, రెండు లేదా మూడు చుక్కల పుదీన నూనె తీసుకొని చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. కొద్దిసేపయ్యాక వేడి నీళ్లతో కడుక్కోవాలి. దీంతో చర్మం సుతిమెత్తగా మారుతుంది.