పరిమళాలు వెదజల్లాలంటే..

ఆంధ్రజ్యోతి (11-01-2019): ఎంతో ఖరీదైన ఫ్రాగ్రెన్స్‌లు కొంటాం! కానీ కొన్నప్పుడు ఉన్నంత నాణ్యత తర్వాత లోపించింది అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం పరిమళంలో కాదు, మనలోనే ఉంది! అదెలాగంటే...

 
దాచాల్సిన చోటు
ఫ్రాగ్రెన్స్‌ నాణ్యత చెక్కుచెదరకుండా ఉండాలంటే తేమ లేదా వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దాచకూడదు. ఎందుకంటే వెలుతురు, వేడి, తేమ... పరిమళం ప్రభావాన్ని తగ్గిస్తాయి. కాబట్టి చల్లగా, పొడిగా ఉండే పడగ్గదిలోని వ్యానిటీ, కిటికీలకు దూరంగా భద్రపరచాలి. తేలికగా కనిపించడం కోసం సెంటు బాటిళ్ల అమరికకు కేక్‌ స్టాండ్‌ వాడాలి.
 
సెంటు వాసన ఘాటుగా!
ఎక్కువ సమయం సువాసన నిలిచి ఉండాలంటే, పల్స్‌ పాయింట్ల మీద సెంటు పూసుకోవాలనే విషయం తెలిసిందే! అయితే అలా పూసుకునేముందు ఆ ప్రదేశంలో వేజిలిన్‌ రాసుకుంటే, సువాసన ఎక్కువ సమయం చర్మానికి పట్టి ఉంటుంది.
 
లోషన్ల కన్నా ముందే
నూనె చర్మం సువాసనలను ఎక్కువ సమయంపాటు నిలిపి ఉంచుతుంది. ఒకవేళ మీది పొడి చర్మమైతే ముందుగా మాయిశ్చరైజర్‌ అప్లై చేసి, తర్వాత సెంటు పూసుకోండి.
 
స్నానం చేసిన వెంటనే
స్నానం చేసిన వెంటనే సెంటు పూసుకోవాలి. ఇలా చేస్తే తడిపొడి చర్మం మీద సెంటు ఇంకిపోయి ఎక్కువ సమయంపాటు గుబాళిస్తుంది.