చెమట పట్టకుండా ఉండాలంటే ..

30-07-2019: వాతావరణం వేడిగా, తేమగా ఉండడం వల్ల మేకప్‌ వేసుకున్న కొద్ది సేపటికే ముఖానికి చెమటలు పడుతుంటాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సరదాగా సెల్ఫీలు, ఫొటోలు దిగేటప్పుడు చెమట ముఖం ఇబ్బందికి గురిచేస్తుంటుంది. అయితే ఫొటోలో తాజాగా కనిపించాలంటే మేక్‌పలో కొన్ని మార్పులు చేస్తే సరి. అవేమిటంటే..
 
మాయిశ్చరైజర్‌: ముందుగా మీరు వాడుతున్న మాయిశ్చరైజర్‌ క్రీమ్‌ను మార్చాలి. రెగ్యులర్‌ క్రీమ్‌ల బదులు జెల్‌ రూపంలో ఉన్న వాటిని ఎంచుకోవాలి. ఎందుకంటే ఇవి తేలికగా ఉంటాయి. దాంతో వీటిని చర్మం తొందరగా పీల్చుకుంటుంది. అంతేకాదు ఇవి చర్మాన్ని ఎక్కువ సమయం హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.
 
ఫేస్‌వాష్‌: జిడ్డు చర్మం ఉన్నవారు నూనెలను తగ్గించే ఫేస్‌వాష్‌ ఉపయోగించాలి. ఇవి అదనపు నూనె, లవణాలను పీల్చుకుంటాయి.
 
ఫేస్‌టోనర్‌: ముఖం కడుక్కున్న ప్రతీసారి టోనర్‌ వాడడం మర్చిపోవద్దు. ఇది చర్మం పీహెచ్‌ను సమస్థాయిలో ఉంచడమే కాదు మీద మిగిలిపోయన పదార్థాలను, మలినాలను తొలగిస్తుంది. ఆల్కహాల్‌ ఉన్న టోనర్లు వాడితే ముఖం మరింత జిడ్డుగా మారుతుంది.
 
మడ్‌ మాస్క్‌: వారానికి ఒకసారి మడ్‌ మాస్క్‌ వేసుకోవాలి. ముల్తానీ మట్టిని ఫేస్‌ప్యాక్‌గా రాసుకుంటే నల్లటి మచ్చలు, మలినాలు తొలగిపోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది.
 
బ్లాటింగ్‌ పేపర్‌: కొందరికి ఎక్కువగా చెమట పడుతుంది. అలాంటివారు బ్లాటింగ్‌ పేపర్స్‌ వెంట ఉంచుకోవాలి. వీటితో తుడుచుకుంటే ముఖం మీది జిడ్డు వదులుతుంది.