అధరాలు ఆరోగ్యంగా...

ఆంధ్రజ్యోతి (10-12-2019): ఈ సీజన్‌లో పెదవులు తొందరగా పొడిబారడంతో పాటు పగుళ్లు ఏర్పడతాయి. అయితే లిప్‌బామ్‌ వంటివి తక్కువ సమయమే పనిచేస్తాయి. అలాంటప్పుడు వంటింట్లో లభించే పదార్థాలతో పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం...
 
చక్కెర, తేనె: పెదవుల మీద మృతకణాలు పేరుకోవడం వల్ల పొడిగా కనిపిస్తాయి. అలాంటప్పుడు స్క్రబ్బర్‌తో వాటిని తొలగించుకోవాలి. తేనె, చక్కెర మిశ్రమం సహజ స్క్రబ్బర్‌గా పనికొస్తుంది. ఈ మిశ్రమంతో రుద్దుకుంటే మృతకణాలు తొలగి పెదవులు మృదువుగా, తాజాగా కనిపిస్తాయి.
 
కొబ్బరినూనె: పగుళ్లు ఏర్పడిన పెదవుల మీద కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే వాటికి తేమ అందుతుంది. కొబ్బరినూనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పెదవుల పగుళ్ల మీద బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి. ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.
 
అలోవెరా: దీనిలోని జెల్‌ పగిలిన పెదవులకు మందుగా పనిచేస్తుంది. అలోవెరా జెల్‌ను కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, పెదవులకు రాసుకోవాలి. రోజుకు రెండు లేదా మూడు సార్లు ఈ జెల్‌ రాసుకుంటే అధరాలు సున్నితంగా, ఆరోగ్యంగా మారతాయి.
 

నెయ్యి: ఒక చుక్క నెయ్యి రుద్దుకుంటే పెదవులకు తేమ అందుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు నెయ్యి రాసుకుంటే పెదవులు తాజాగా కనిపిస్తాయి.

గ్రీన్‌ టీ బ్యాగ్‌: ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్‌, మినరల్స్‌, పాలీఫెనాల్స్‌ పెదవులకు రక్షణనిస్తాయి. అందుకే గ్రీన్‌ టీ బ్యాగును పెదవుల మీద కొద్దిసేపు రుద్దుకుంటే మృతకణాలు మాయమవుతాయి.