టాటూతో కాస్త జాగ్రత్త

ఆంధ్రజ్యోతి(17-11-15): మనిషి శరీర భాగాల్ని పలు వర్ణాలతో రసరమ్యం చేసే టాటూ కళ నేడెంతో జనాధరణ పొందుతోంది. అయితే, ఆ టాటూ వల్ల రకాల దుష్ప్రభావాలు ఉన్నాయి. ఇటీవలి అధ్యయనాల ప్రకారం టాటూ  వల్ల  ‘కాంటాంక్ట్‌ డెర్మటైటిస్‌’ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ అధ్యయనంలో భాగంగా న్యూయార్క్‌ నగరంలో టాటూ వేయించుకున్న 300 మందిని పరిశీలిస్తే,  వారిలో 10 శాతం మందిలో విపరీతమైన దురద, చర్మం పెళుసులుగా లేచిపోవడం, వాపు, వంటి లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలు  కొందరిలో నెలల  పర్యంతం కొనసాగుతూ ఉంటే మరికొందరిలో కొన్నేళ్ల దాకా ఉన్నాయి.  అలాంటి వారు, కొన్ని టాటూలతో జీవిత కాలమంతా మాయని మచ్చలు ఏర్పడ్డాయని వారు పేర్కొన్నారు  వీరిలో మూడింట రెండింతల  మంది  అంతకుముందే అలర్జీలతో బాధపడుతున్నారని, వారిలో కొంత మంది ఇమ్యూన్‌  మెడికేటెడ్‌ ఔషధాలు వాడుతూ ఉన్నట్లు తేలింది.  ఏమైనా టాటూ వర్ణాల్లో వాడుతున్న  మెర్క్యురీ లాంటి లోహాల వినియోగాన్ని 1970లోనే  నిషేధించారు. అయినా ఆ సమస్యలతో బాధపడే వారిలో వెంటనే అంత పెద్ద మార్పేమీ కనిపించలేదు. అందుకే ఈ టాటూ మౌలికాంశాల మీద, వాటి దుష్ప్రభావాల మీద మరెంతో అధ్యయనం చేయాల్సి ఉందని పశోధకులు అంటున్నారు.