సౌందర్యలహరి

ఆంధ్రజ్యోతి(01/07/15): కొద్ది సమయాన్ని సౌందర్య సంరక్షణకు కేటాయిస్తే గంటలు గంటలు పార్లర్‌లకు కేటాయించాల్సిన అవసరం లేదంటున్నారు బ్యూటీ ఎక్స్‌పర్ట్స్‌. అందుకు వాళ్లు చేస్తున్న సూచనలే ఇవి...

వంట గది సర్దేటప్పుడు ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే మీ పనులు పూర్తయ్యే లోపు ప్యాక్‌ కూడా ఆరిపోతుంది. ఇంట్లో ఫేస్‌ప్యాక్‌, మాస్క్‌ల వంటివి తయారుచేసుకునే సమయం లేకపోతే కూడా నో ప్రాబ్లమ్‌. టొమాటో ముక్కల రసాన్ని ముఖానికి పులిమేస్తే సరి. ఇలానే బొప్పాయి పండు, బంగాళా దుంప ముక్కలు, అవకాడో, కీర దోసకాయ, దోసకాయ వంటి వాటి రసాల్ని ముఖానికి పూసుకోవచ్చు. అయితే రెండు మూడు కలిపి ఒకేసారి కాకుండా రోజుకొకటి చొప్పున వాడాలి.మార్కెట్‌లో లభించే ఫేస్‌ప్యాక్‌లు, స్క్రబ్‌లు కొని రాసుకుంటే చాలా సమయం కలిసొస్తుంది. అయితే ఇవి అందుబాటులో కనిపిస్తూ ఉంటే తప్ప వాడరు. అందుకని బాత్రూమ్‌ అల్మరాల్లో, డ్రస్సర్‌లో పెట్టుకోవాలి.

చాలామంది ఆడవాళ్లు పని అలసట వల్ల లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల ముఖాన్ని కడుక్కోకుండానే నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో ముఖ చర్మం దెబ్బతింటుంది. అందుకని పడుకునే ఐదు నిమిషాల ముందు ముఖాన్ని కడుక్కుని నైట్‌ క్రీం లేదా సీరమ్‌ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల అందమైన చర్మం మీ సొంతమవుతుంది. దంతధావనం కూడా తప్పనిసరి. వారంలో ఒకరోజు స్క్రబ్‌ వాడే అలవాటు చేసుకోవాలి. స్ర్పే టోనర్‌ బ్యాగులో పెట్టుకుంటే అవసరమైనప్పుడల్లా వాడేందుకు అందుబాటులో ఉంటుంది.

ఫౌండేషన్‌, సన్‌ స్ర్కీన్‌లు వాడడం ఇష్టం లేదా అయితే బిబి క్రీమ్‌లు వాడొచ్చు. ఇవి ఫౌండేషన్‌, సన్‌స్ర్కీన్‌లకు మల్లే ఉపయోగపడతాయి. వీటిలో మాయిశ్చర్‌ కూడా ఉంటుంది.షాంపూ చేయడం కండిషనింగ్‌ చేసుకోవడం తప్పనిసరి. ఇంటి దగ్గరలో ఉన్న పార్లర్‌లో వారానికి ఒకసారి లేదా పదిహేను రోజులకి ఒకసారి హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం మంచిది. ఇవేవీ కుదరదా అయితే నిద్రపోబోయే ముందు కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ నూనెతో మర్దనా చేసుకోవాలి. దిండు మీద ఒక బట్ట వేసి పడుకుంటే మరకలు పడవు. తెల్లవారి ఉదయం తలస్నానం చేయాలి.మరుసటి రోజు వేసుకోవాల్సిన బట్టల్ని ముందు రోజు రాత్రి తీసి పెట్టుకుంటే చాలా సమయం కలిసొస్తుంది. పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది.