చర్మం కోమలం!

17-10-2019:చర్మం పట్ల చలికాలంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. లేదంటే చిట్లడం, పొడిబారడం, కుంగిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
 
క్లీనింగ్‌
మాయిశ్చరైజర్‌ రాసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుందనే విషయం తెలిసిందే! అయితే మాయిశ్చరైజర్‌ రాసుకునే ముందు చర్మం మీద పేరుకున్న మృతకణాలను తొలగించాలి. ఇందుకోసం రోజు విడిచి రోజు బియ్యప్పిండి, నిమ్మరసం, తేనె, పెరుగు మిశ్రమంతో ముఖానికి కొద్దిసేపు మర్దన చేసి కడిగేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని టవల్‌తో తుడుచుకుని, మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
 
తేమగా...
చర్మానికి తేమ అవసరం. ఇది వ్యక్తికీ, వ్యక్తికీ, కాలానికీ, కాలానికీ మారుతూ ఉంటుంది. చలికాలం వాతావరణం పొడిగా ఉంటుంది. కాబట్టి చర్మం కూడా పొడిబారుతుంది. పొడిచర్మం కలిగిన వాళ్లు నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌, జిడ్డుచర్మం కలిగినవాళ్లు ఆయిల్‌ బేస్డ్‌ మాయిశ్చరైజర్‌ వాడాలి. వీలైతే మీగడ, తేనె, నిమ్మరసం మిశ్రమం ముఖానికి పూసుకుని ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
 
సన్‌స్ర్కీన్‌
సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేస్తాయి. వీటి నుంచి కాపాడుకోవడానికి సన్‌స్ర్కీన్‌ వాడడం తప్పనిసరి. అయితే చలికాలం ఎండ తీవ్రత తక్కువ కాబట్టి సన్‌స్ర్కీన్‌ అవసరం లేదు అనుకుంటే పొరపాటు. తీవ్రత లేకున్నా, సూర్యకిరణాలు సోకడం వల్ల చర్మం రంగు మారడం ఆగదు. కాబట్టి సన్‌స్ర్కీన్‌ లోషన్‌ వాడడం తప్పనిసరి.