పెర్‌ఫ్యూమ్స్‌తో జాగ్రత్త!

ఆంధ్రజ్యోతి: సువాసనలంటే అందరికీ ఇష్టమే!  సువాసనలు వెదజల్లే స్ర్పే చేసుకోందే పూర్తిగా తయారైనట్టు ఉండదు కొందరికి. ఇందుకోసం డియోడరెంట్లు మొదలుకుని బాడీ స్ర్పేల వరకూ ఎన్నో పరిమళాలు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే వీటి వాడకం ఎంతవరకూ ఆరోగ్యకరం అని ఎప్పుడైనా ఆలోచించారా... 

పరిమళాలు మనసును మైమరిపిస్తాయి. అందుకే డిటర్జెంట్లు, క్యాండిల్స్‌, బాడీ వాష్‌లు, సబ్బులు, కొలోన్‌లు, రూమ్‌ ఫ్రెష్‌నర్స్‌...ఇలా పరిసరాల్ని సువాసనలతో నింపేసే ఎన్నో ఫ్రాగ్నెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే రసాయనాలతో తయారయ్యే ఈ ఉత్పత్తులు చర్మం మీద దుష్ప్రభావాలను చూపిస్తాయి. 
 
చర్మ సమస్యలు తప్పవు
సువాసన కలిగిన ఫ్రాగ్నెన్స్‌ల్లో ఆల్కహాల్‌ ఉంటుంది. ఇది చర్మంపై ప్రభావాన్ని చూపిస్తుంది. పరిమళాలు వెదజల్లే ఉత్పత్తుల వల్ల సున్నితమైన చర్మం కలిగినవారికి పిగ్మెంటేషన్‌, అలర్జీలాంటి సమస్యలు బాధిస్తాయి. అప్పటికే పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్నవాళ్లు ఈ పరిమళాలు వాడితే సమస్య మరింత తీవ్రమవుతుంది. దీర్ఘకాలంపాటు పర్‌ఫ్యూమ్స్‌ వాడేవారు పిగ్మెంటేషన్‌ బారినపడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సున్నిత చర్మం కలిగినవారు, పిగ్మెంటేషన్‌ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండాలి.
 
జాగ్రత్తలు తప్పనిసరి
సెంట్లు, డియోడరెంట్లు, ఇతర పరిమళ ద్రవ్యాలు వాడాలి అనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. చర్మానికి తగిలినప్పుడు రసాయనిక చర్య జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని దుస్తుల మీదే రాయాలి. దుస్తుల మీద మరకలు ఏర్పడే అవకాశాన్ని తెలుసుకోవడం కోసం ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ చేయాలి. మరీ ముఖ్యంగా అసిటోన్‌, ఇథనాల్‌, బెంజైల్‌ ఆల్కహాల్‌, ఇథైల్‌ అసిటేట్‌, మిథిలీన్‌ క్లోరైడ్‌, డైథైల్‌ ఫ్తాలేట్‌, క్యాంఫర్‌, లిమోనిన్‌ కలిగిన పర్‌ఫ్యూమ్‌లను కొనకపోవడం మంచిది. పర్‌ఫ్యూమ్‌ కొనబోయేముందు ప్యాకేజ్‌ మీద ఈ రసాయన పదార్థాలు ఉన్నాయేమో చూడాలి. ఈ రసాయనాలు కలిగిన పర్‌ఫ్యూమ్స్‌ వాడితే చర్మం దురద, మైగ్రెయిన్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయి.
 
ప్రత్యామ్నాయ పరిమళాలు
రసాయనాలతో తయారైన పెర్‌ఫ్యూమ్స్‌కు బదులుగా ప్రకృతిసిద్ధ పరిమళాలను వాడటానికి ప్రయత్నించాలి. సువాసనలు వెదజల్లే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌తో నచ్చిన పరిమళ ద్రవ్యాలను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం ప్రధానంగా 100 స్వచ్ఛమైన వోడ్కా (స్వచ్ఛమైన వోడ్కాలో మాత్రమే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ పూర్తిగా కరుగుతాయి) లేదా నీళ్లు లేదా క్యారియర్‌ ఆయిల్‌, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌, గాజు స్ర్పే బాటిల్‌ అవసరమవుతాయి.
 
ఫారెస్ట్‌ ఫెయిరీస్‌ బ్లెండ్‌
వోడ్కా - 2 టే.స్పూన్లు
స్వీట్‌ ఆరెంజ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ - 40 చుక్కలు
సెడార్‌వుడ్‌ ఆయిల్‌ - 20 చుక్కలు
పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ - 10 చుక్కలు
రోజ్‌మేరీ ఆయిల్‌ - 5 చుక్కలు
వీటన్నిటినీ కలిపి గాజు స్ర్పే బాటిల్‌లో నింపుకుని వాడుకోవాలి.

రొమాంటిక్‌ ఫ్లవర్‌ గార్డెన్‌

వోడ్కా - 2 టే.స్పూన్లు
స్వీట్‌ ఆరెంజ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ - 20 చుక్కలు
లావెండర్‌ ఆయిల్‌ - 5 చుక్కలు
పచోలి ఆయిల్‌ - 10 చుక్కలు
సెడార్‌వుడ్‌ ఆయిల్‌ - 10 చుక్కలు
య్లాంగ్‌ య్లాంగ్‌ ఆయిల్‌ - 5 చుక్కలు
బెర్గమోట్‌ ఆయిల్‌ - 5 చుక్కలు