పెదాలపైన రోమాలకు..

ఆంధ్రజ్యోతి(07/07/15): ముఖానికి బ్యూటీస్పాట్‌ పెదాలు. ఆ పెదాల పై భాగంలోనే అవాంఛిత రోమాలు వస్తుంటే చికాకు వేస్తుంది. వాటిని అత్యంత సులభంగా ఎలా తొలగించుకోవాలో చూద్దాం..

ఒక టేబుల్‌ స్పూన్‌ పసుపులోకి కొన్ని పాలు పోసి బాగా కలియబెట్టాలి. అది పేస్ట్‌లాగ తయారవుతుంది. అయిదు నిమిషాల తరువాత.. పై పెదవి పైభాగాన రాసుకోవాలి. అరగంటకు పొడిబారి చెక్కలాగ మారుతుంది. అప్పుడు దాన్ని మెల్లగా తొలగించుకుని చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

మరో సులువైన చిట్కా- పసుపులోకి కొంత నీటిని కలిపి పేస్ట్‌లాగ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పై పెదవి మీదున్న రోమాలపై రాసుకోవాలి. అరగంట తరువాత పొడిబారుతుంది. వేలితో గట్టిగా అటూఇటూ రుద్దితే పొడిలా రాలిపోతుంది. కాసేపయ్యాక సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

గుడ్డులోని తెల్లసొనలోకి కార్న్‌ఫ్లోర్‌, పంచదార వేసుకుని బాగా కలియబెట్టాలి. దీన్ని రోమాలున్న చోట రాస్తే సరి. కాసేపయ్యాక గట్టిపడుతుంది. దాన్ని మెల్లగా తొలగిస్తే రోమాలు తొలగిపోతాయి.

పంచదారను ఒక నిమిషం పాటు పాన్‌ మీద వేగించాలి. చల్లారిన తరువాత.. అందులోకి నిమ్మరసాన్ని కలిపితే చిక్కటి పేస్టు అవుతుంది. దీని ద్వారా కూడా పెదవి పైనున్న రోమాలను వదిలించుకోవచ్చు.

పెరుగు, శనగపిండి, పసుపుల మిశ్రమం కూడా ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ పేస్టును రాసుకున్నాక పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండాలి. ఆ తరువాత రబ్బింగ్‌ చేసుకుని.. చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుంటే చక్కటి ఫలితం లభిస్తుంది.