పెదాలు పగులుతున్నాయా?

ఆంధ్రజ్యోతి(17-10-15): చల్లగాలికి పెదాలు పగలడం కామనే. పెదాలపై తడి ఆరిపోయి పగులుతుంటాయి. కొందరికి  అసలేమీ తినలేని స్థితి కూడా  ఏర్పడుతుంది. ఎందుకంటే నోరు తెరిచిన ప్రతిసారీ పెదాల్ని ఎవరో సన్నటి కత్తితో కోస్తున్నంతగా బాధేస్తుంది.  వాతావరణ కారణాలతో పాటు బి-విటమిన్‌, ఐరన్‌ లోపించినప్పుడు కూడా ఈ సమస్య మొదలవుతుంది. పెదాలు మందంగా మారడం గానీ పగలడం గానీ, కొందరిలో అలర్జీ వల్ల జరగొచ్చు. మరికొందరిలో వారు వాడే లిప్‌స్టిక్స్‌ల్లోని రసాయనాల ప్రభావం వల్ల కూడా కావచ్చు. డాక్టర్లు సాధారణంగా పెదాలు వాడిపోవడానికి శరీరం నీటి శాతం తగ్గిపోయే డీ-హైడ్రేషన్‌ కారణంగా చెబుతుంటారు. కొందరి పిల్లల్లో ఈ సమస్య రావడానికి నోటితో గాలి పీల్చే అలవాటు కారణంగా కనిపిస్తుంది.  కొందరి పెదాలమీద  పైపొర కొంచెం కొంచెంగా లేవవచ్చు. ఈ దశలో కొందరు ఆ పొరను మొత్తంగా తీసివేయడానికి  ప్రయత్నిస్తారు. ఆ స్థితిలో ఒక్కోసారి రక్తం వచ్చి బాగా నొప్పి చేయవచ్చు. సమస్య ఎక్కువ రోజులు అలాగే ఉంటే  ఆ  భాగంలో ఇన్‌ఫెక్షన్లు కూడా తలెత్తవచ్చు. ఏమైనా ఈ సమస్య కేవలం వాతావరణ కారణాలతో వచ్చినదే అయితే పెదాల మీద  లిప్‌బామ్‌ గానీ,  పెట్రోలియం జెల్లీ గానీ రాస్తే తగ్గిపోతుంది. ఒక వేళ అలా తగ్గకుండా రోజురోజుకూ ఇంకా పెరుగుతూ పోతే డాక్టర్‌ను సంప్రదించడం ఇక్కడ తప్పనిసరి అవుతుంది అంటున్నారు ఈన్‌టి వైద్య నిపుణులు.