పేల సమస్యకు విరుగుడు..

ఆంధ్రజ్యోతి(01/0715): పరాన్నజీవులైన పేలు ఒకరినుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా స్కూలు పిల్లల్లో ఈ సమస్య విపరీతంగా కనబడుతుంది. స్కూల్లో ఒకరిపక్కన ఒకరు కూర్చోవడం, కలిసి ఆడుకోవడం వంటి అనేక సందర్భాల్లో ఈ పేలు త్వరగా ఒకరినుండి వేరొకరికి వ్యాప్తి చెందుతాయి. ఈ పేలు ఎంత మందికి వ్యాప్తి చెందినా వాటిద్వారా ఏ విధమైన అంటురోగాలు రావు. సాధారణంగా తలపైన గుడ్డు పెట్టి పిల్లలుగా మారిన తర్వాత తలపైన రక్తాన్ని  పీల్చి తాగుతుంటాయి. దీనివల్ల దురద, మంట ఏర్పడి గోళ్లతో బాగా గోకడం వల్ల చర్మం చీరుకొని విపరీతమైన దురద పుడుతుంది. దువ్వడం వల్ల కొన్నాళ్లకు పేల సంఖ్య తగ్గినా పూర్తిగా ఫలితం కనిపించదు. ఈ పేల సమస్యకు ఎన్నో సులభమైన వంటింటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి.

5 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి 3 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలిపి తలకు పూర్తిగా పట్టించాలి. అరగంట ఆగి వేడినీటితో స్నానం చేసిన తర్వాత దువ్వెనతో బాగా దువ్వితే పేల సమస్య తీరుతుంది.

వెల్లుల్లిపాయ రసం తీసి దానికి సమంగా ఏదైనా వంటనూనె గానీ, నిమ్మరసాన్ని గానీ, గ్రీన్‌టీ డికాక్షన్‌ గాని, ఏదో ఒక షాంపూ గాని కలిపి తలకు పట్టించి ఒక టవల్‌తో కప్పి అరగంట తర్వాత షాంపూతో వేడినీటి స్నానం చేస్తే పేలు చచ్చిపోతాయి.

రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఆలివ్‌ ఆయిల్‌ను జుట్టు కుదుళ్లలోకి బాగా రాసి పడుకోండి. ఉదయం లేవగానే దువ్వెనతో బాగా దువ్వితే చచ్చిపోయిన పేలు పడిపోతాయి. తర్వాత వేడినీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే పేల బాధ తప్పుతుంది.

5 లేక 7 తెల్ల ఉల్లిగడ్డల రసం తీసి తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత వేడి నీటితో తల స్నానం చేయాలి. ఇలాగ వారం రోజుల పాటు చేస్తే పేల బాధనుంచి విముక్తి కలుగుతుంది.

10 బాదం పప్పులను నీటిలో ముందు రోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే లేచి బాదంపప్పుల తోలు తీసి పేస్టుగా నూరి, 4 టేబుల్‌ స్పూన్ల నిమ్మరసంతో కలిపి తలపై బాగా రాయాలి. అరగంట తర్వాత తల స్నానం చేస్తే పేల బాధ తప్పుతుంది.

వేప గింజల నూనె 5 గ్రాములు తీసుకుని దీనికి సమంగా ఏదైనా షాంపూ కలిపి తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.  

ఆపిల్‌సైడర్‌ వెనిగర్‌కి సమం నీరు కలిపి తలకు పట్టించి అర గంట తర్వాత దువ్వెనతో దువ్వాక వేడినీటి స్నానం చేయిస్తే పేల బాధ 
తగ్గిపోతుంది.
 
 
డాక్టర్‌ కందమూరి, ఆయుర్విజ్ఞాన కేంద్రం