పసుపు సౌందర్యం

ఆంధ్రజ్యోతి(06/09/14): రెడీమేడ్‌ ఫేస్‌ప్యాక్‌లు, స్క్రబ్బర్‌లు వాడడం మొదలుపెట్టి ఎక్కువమంది పసుపు వాడకాన్ని దాదాపుగా మానేశారు. కాని పసుపు వాడకం వల్ల మెటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్‌ వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పసుపుతో మాస్క్‌, స్క్రబ్బర్‌, ఫేస్‌ప్యాక్‌లను ఇంట్లోనే తయారుచేసుకుని మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. వాటి తయారీ, వాడే విధానం గురించిన వివరాలే ఇవి... 
మాస్క్‌: పసుపు- ఒక టీస్పూన్‌, నిమ్మరసం - మూడు టీస్పూన్లు తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
స్క్రబ్‌: పసుపు - ఒక టీస్పూన్‌, మీగడ - ఒక టేబుల్‌ స్పూన్‌(జిడ్డు చర్మం గల వాళ్లు మీగడ బదులు పాలు లేదా నీళ్లు వాడొచ్చు), శెనగపిండి - రెండు టీస్పూన్లు . వీటన్నింటినీ కలిపి స్క్రబ్‌ తయారుచేసి, చేతి వేళ్ల చివర్లతో ముఖంపై సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది.
ఫేస్‌ ప్యాక్‌: పసుపు - ఒక టీస్పూన్‌, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, టొమాటో రసం - రెండు టేబుల్‌ స్పూన్లు, పాలు - సరిపడా. వీటన్నింటిని ఒక గిన్నెలో కలిపి పేస్ట్‌లా చేయాలి. తరువాత ఈ మాస్క్‌ని ముఖానికి, మెడకు వేసుకుని అరగంటసేపు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి.