పరుగులు తీసే పాదాలకు

ఆంధ్రజ్యోతి(3-11-15): మెరుగైన ఆరోగ్యానికి పరుగుకు మించిన వ్యాయామం లేదు. ఉదయాన్నే జాగింగ్‌ చేయడం దినచర్యగా చేసుకుంటే ఫిట్‌నెస్‌ ఒంటిపట్టునే ఉంటుంది. అయితే పరుగులు తీసే పాదాలకు సరైన షూ లేకపోతే సంపూర్ణమైన ఫలితం దక్కదు. మీరు ఎంచుకునే షూలు అడుగులకు మడుగులొత్తాలంటే అవి ఇలా ఉండేలా చూసుకోండి.

 షూ వెనుక వైపు బిగుతుగా ఉండకూడదు. పాదానికి సరిగ్గా ఫిట్‌ కావాలి. షూలేస్‌ విప్పకుండానే పాదం బయటకు తీసేలా కాస్త ఫ్రీగా ఉండాలి. పరుగు తీసేటప్పుడు మడమ దగ్గరి కండరాలు కదులుతుంటాయి. వాటి కదలికలను షూ నియంత్రించకూడదు. అదే సమయంలో మడమపై ఒత్తిడి పడకుండా షూ కింది భాగం కాస్త మెత్తగా ఉండాలి.

పాదం పైభాగం సున్నితంగా ఉంటుంది. షూ  పాదానికి హత్తుకుని ఉండేలా చూసుకోవాలి. జాగింగ్‌ చేస్తున్నప్పుడు పాదాలకు పట్టే చెమటను గ్రహించాలి.లోపలి భాగం మృదువుగా, మన్నికగా ఉండేలా చూసుకోవాలి.

కొన్ని షూలు వెనుకవైపు వదులుగా ఉన్నా, వేళ్ల దగ్గరికి వచ్చేసరికి బిగుతుగా మారతాయి. వేళ్లు దగ్గరిగా వస్తే జాగింగ్‌ను మీరు ఎంజాయ్‌ చేయలేరు. ఫ్రంట్‌ ఎడ్జ్‌ కాస్త వెడల్పుగా ఉండేలా షూ సెలెక్ట్‌ చేసుకోండి.

హైగ్రిప్‌ షూ వేసుకుని జాగింగ్‌ చేస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. అయితే పాదంపై ఒత్తిడి పడకుండా బేస్‌ కాస్త ఫ్లెక్సిబుల్‌గా ఉండేలా చూసుకోండి.