ఆయిల్‌ ఫ్రీ స్కిన్‌

ఆంధ్రజ్యోతి(2-8-15): జిడ్డు చర్మం వాల్లకి మేకప్‌ వేసుకునే అలవాటు ఉంటే కనుక వాళ్లు జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ వాడకూడదు. అటువంటివి వాడడం వల్ల చర్మ రంధ్రాలలో కాస్మొటిక్స్‌ చిక్కుకుని బ్లాక్‌హెడ్స్‌గా మారతాయి. తరువాత అవే మొటిమలు అవుతాయి.

జిడ్డు చర్మం గల వాళ్లు సున్నితమైన క్లెన్సర్‌ను ఉపయోగించాలి. సబ్బు కంటే కూడా క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని నీళ్లతో కడిగేసుకుంటే ముఖం శుభ్రంగా ఉంటుంది. పదే పదే సబ్బును ఉపయోగించడం వల్ల చర్మకణాలు పాడవుతాయి.

మృత చర్మ కణాలను తొలగించేందుకు ఎక్స్‌ఫోలియేషన్‌ చేయడం మంచిది. చర్మ రంధ్రాలలో వృద్ధి చెందే మృతకణాలను ఎక్స్‌ఫోలియేట్‌ చేయడం ద్వారా తొలగిస్తే బ్లాక్‌హెడ్స్‌ సమస్య చాలావరకు తీరిపోతుంది.

బాగా జిడ్డుగా ఉంటే ఆ జిడ్డును తొలగించేందుకు క్లే మాస్క్‌ ఉపయోగించాలి. పుదీనా, పిప్పర్‌మెంట్‌ లేని క్లే మాస్క్‌ను వాడడం మంచిది.

నిమ్మరసం, బాదం నూనె, గ్లిజరిన్‌లను సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించుకోవాలి. ఇది బ్లాక్‌హెడ్స్‌ తగ్గేందుకు ఉపకరించడమే కాక ముఖంపై ఉండే ఇతర మచ్చలను కూడా తగ్గిస్తుంది.

ప్రతిరోజూ సాయంత్రం గోరువెచ్చటి నీళ్లలో ముంచిన బట్టతో ముఖాన్ని తుడుచుకోవడం ఎంతో మంచిది. గోరువెచ్చటి నీళ్లలో టవల్‌ లేదా నాప్‌కిన్‌ను ముంచి పావుగంట పాటు ముఖం మీద వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలలో చిక్కుకుపోయిన మురికి, మృతకణాల వంటివి బయటకు వచ్చేస్తాయి. అనంతరం నాప్‌కిన్‌ను వేడినీళ్లలో ఉతకడం మాత్రం మరిచిపోకండి.

కొంచెం తేనె తీసుకుని దానిని వేడిచేసి బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉన్నప్రాంతంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది సహజమైన పీల్‌లా ఉపయోగపడుతుంది. బ్లాక్‌హెడ్స్‌ తొలగించేందుకు బాగా దోహదం చేస్తుంది.