సహజ ప్యాక్‌లే మేలు!

19-08-2019: జిడ్డు చర్మం ఉన్నవారు స్కిన్‌కేర్‌ ఉత్పత్తులు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటర్‌ బేస్డ్‌ ఉత్పత్తులనే ఎంచుకోవాలి. ఔషధ గుణాలున్న సబ్బు ఉపయోగించాలి. వీటితో పాటు ఇంటి వద్దనే తయారుచేసుకున్న కొన్ని ఫేస్‌ప్యాక్స్‌ వాడితే ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. అవేమిటంటే...
 
పసుపు మిశ్రమం: కొద్దిగా గంధం పొడిలో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక శుభ్రం చేసుకోవాలి.
 
రోజ్‌వాటర్‌, గంధం: కొద్దిగా రోజ్‌వాటర్‌ను గంధం పేస్టులో కలిపి, ఆ మిశ్రమాన్ని రోజూ ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతిమంతగా కనిపిస్తుంది.
 
దాల్చినచెక్క, నిమ్మరసం: కొద్దిగా దాల్చినచెక్క పొడి తీసుకొని, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. తేనె కూడా వేసి చిక్కని పేస్టులా చేసుకోవాలి. మచ్చల మీద ఈ మిశ్రమాన్ని రాసుకొని, గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
 
ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్‌: నిమ్మరసం, రోజ్‌వాటర్‌ను ముల్తానీ మట్టిలో వేసి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకొని ఆరిపోయాక నీళ్లతో కడుక్కోవాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలాచేస్తే ముఖం తాజాగా, మెరుస్తూ కనిపిస్తుంది.