అందానికి ముల్తానీ మట్టి!

15-10-2019: మేకప్‌ ఉత్పత్తుల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే అందంగా కనిపించొచ్చు. వంటింట్లోని పదార్థాలతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
మిల్క్‌ పౌడర్‌, బాదం గింజల పొడి, బియ్యప్పిండి, గులాబీ రేకుల్ని శుభ్రమైన వస్త్రంలో మూట కట్టాలి. ఆ వస్త్రంతో చర్మం మీద నెమ్మదిగా రుద్దుకోవాలి. ఈ మిశ్రమం చర్మానికి పరిమళాన్ని ఇవ్వడమే కాదు మృదువుగా మార్చుతుంది కూడా.
ముఖం మీది మలినాలు తొలగించాలంటే రాత్రిపూట ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. సగం కప్పులో చల్లని పాలలో అయిదు చుక్కల నువ్వుల నూనె లేదా ఆలివ్‌ నూనె వేసి కలపాలి. కాటన్‌ బాల్‌ను ఈ మిశ్రమంలో ముంచి చర్మం మీద మర్ధన చేసుకోవాలి.
ముల్తానీ మట్టి సహజ క్లీన్సర్‌గా పనిచేస్తుంది. జిడ్డును తొలగించి స్కిన్‌ ఆయిలీగా కనిపించకుండా చేస్తుంది. చర్మానికి కాంతినిచ్చి, మృదువుగా మారుస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిలో రోజ్‌ కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. కళ్లు, పెదాల దగ్గర అంటకుండా జాగ్రత్తపడాలి.
తేనె, నిమ్మరసం సమపాళ్లలో కలిపి రోజూ ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీళ్లతో కడుక్కోవాలి. దీంతో చర్మం సున్నితంగా మారుతుంది. ఈ మిశ్రమంలో గుడ్డు తెల్లసొన కలిపి కూడా ముఖానికి రాసుకోవచ్చు.
వారానికి ఒకసారి లేదా రెండుసార్లు చర్మం మీది మృతకణాలను స్క్రబింగ్‌ ద్వారా తొలగించుకోవాలి. దాంతో చర్మం తాజాగా మారుతుంది. బాదం గింజల పొడిలో కొద్దిగా యోగర్ట్‌, చిటికెడు పసుపు వేసి ప్యాక్‌లా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖం మీద వలయాకారంలో రాసుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.