మృదువైన మోచేతులు, మోకాళ్ల కోసం...

05-07-2019: ఒత్తిడి, రాపిడి వల్ల మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. ఈ ప్రదేశాలు కూడా మిగతా శరీరంలో కలిసిపోయేలా తెల్లగా మారాలంటే ఈ ప్యాక్స్‌ అప్లై చేయాలి.
అలోవెరా జెల్‌: అలోవెరా గుజ్జును రెండు చోట్లా పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి క్రమం తప్పక చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మోచేతులు, మోకాళ్లు తెల్లగా మారతాయి.
పసుపు, తేనె, పాలు: పాలు బ్లీచ్‌లా పనిచేస్తే, తేనె చర్మానికి తేమను అందిస్తుంది. పసుపు క్రిమిసంహారకం. కాబట్టి ఈ మూడింటినీ కలిపి ప్యాక్‌ వేయాలి. పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే మోచేతులు, మోకాళ్ల దగ్గరి చర్మం తేటగా తయారవుతుంది.
ఆలివ్‌ ఆయిల్‌, పంచదార: నలుపు వదలాలంటే స్క్రబ్‌ చేయాలి. ఇందుకోసం ఆలివ్‌ ఆయిల్‌లో పంచదార కలిపి మోచేతులు, మోకాళ్లమీద సున్నితంగా స్క్రబ్‌ చేయాలి. తర్వాత సబ్బు నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే ఈ ప్రదేశాలు తెల్లగా తయారవుతాయి.
నిమ్మ రసం: నిమ్మరసం చర్మానికి తెల్లదనాన్నిస్తుంది. మోకాళ్లు, మోచేతుల మీద నిమ్మ రసం అప్లై చేసి గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా నలుపు వదిలేవరకూ ప్రతిరోజూ చేయాలి.
హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌: సూర్యరశ్మి వల్ల నల్లబడిన చర్మాన్ని హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ తెల్లబరుస్తుంది. దీన్లో దూదిని ముంచి మోకాళ్లు, మోచేతుల మీద 15 నిమిషాలపాటు రుద్దాలి. రుద్దతున్నప్పుడే నలుపు తగ్గటం మీరు
గమనిస్తారు.
సన్‌స్ర్కీన్‌ లోషన్‌: ముఖంతోపాటు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ను ఈ రెండు ప్రదేశాల్లో కూడా అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే సన్‌ టాన్‌ రాకుండా ఉంటుంది.
బాదం పప్పు: బాదంలో విటమిన్‌-ఇ ఉంటుంది. కాబట్టి బాదం పప్పును మెత్తగా నూరి దాంతో మోకాళ్లు, మోచేతులు రుద్దాలి. ఇలా చేస్తే మృత కణాలు తొలగి ఈ రెండు ప్రదేశాలు తెల్లబడతాయి.