మొటిమల గుంటలు!

24-06-2019: మొటిమలు తగ్గిన తర్వాత ఆ ప్రదేశంలో ఏర్పడే గుంటల్లోనూ రకాలుంటాయి. వాటి రకాన్ని బట్టి చికిత్సలు తీసుకోవలసి ఉంటుంది. ఆ రకాలు...
 
బాక్స్‌ స్కార్స్‌: గుంటలు కోడిగుడ్డు ఆకారంలో ఉండి, వాటి అంచులు మొనదేలి ఉంటాయి. ఈ గుంటల వల్ల చర్మం ఎగుడుదిగుడుగా మారుతుంది.
 
రోలింగ్‌ స్కార్స్‌: అలల్లా చర్మంలోనే కలిసిపోయి ఉంటాయి. బాక్స్‌ స్కార్స్‌లా వీటికి నిర్దిష్టమైన ఆకారం ఉండదు.
 
ఐస్‌ పిక్‌ స్కార్స్‌: చర్మం ఉపరితలం మీద కనిపించే గుంట ఐస్‌ కోన్‌ అంచును పోలి ఉంటుంది. చర్మం అడుగుకు వెళ్లేకొద్దీ కోన్‌ ఆకారం సంతరించుకుంటుంది.
 
డీప్‌ స్కార్స్‌: ఇవి లోతుగా ఏర్పడి, ఆటలమ్మ (చికెన్‌ పాక్స్‌) గుంటలను పోలి ఉంటాయి.
 
చికిత్సలు ఇవే!
మొటిమల గుంటలు తొలగించడం కోసం లేజర్‌ చికిత్సతో పాటు, కెమికల్‌ పీల్స్‌ కూడా అవసరమవవచ్చు. మొటిమల కారణంగా ఒక వ్యక్తికే నాలుగు రకాల గుంటలూ ఏర్పడవచ్చు. అయితే వాటిలో ఉండే హెచ్చుతగ్గులను బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. కొందరిలో ఐస్‌ పిక్స్‌ ఎక్కువగా ఉండి రోలింగ్‌ స్కార్స్‌ తక్కువ ఉండవచ్చు. ఇంకొందరిలో దీనికి పూర్తిగా భిన్నంగానూ ఉండవచ్చు. కాబట్టి ఏ రకం గుంటలు ఎక్కువగా ఉన్నాయో కనిపెట్టి, వాటి ఆధారంగా చికిత్స ఇవ్వవలసి ఉంటుంది.