సిర్రోసిస్‌ లక్షణాలేంటి?

08-09-2017: మా అన్నయ్యను ఇటీవల హాస్పిటల్‌కు తీసుకువెళితే, ‘‘ఆల్కహాలు అలవాటు ఉందా?’’ అన్నారు. ఆయన మౌనంగానే ఉన్నా, నేను ఆ అలవాటు ఉందని చెప్పేశాను. దానికి సమాధానంగా డాక్టర్‌, ఆయనకు లివర్‌ సిర్రోసిస్‌ ఉందన్న అనుమానం కలుగుతోంది అన్నారు. వివరాలు అడిగితే తర్వాత చెబుతాంలే అని దాటేశారే తప్ప మరే వివరాలూ చెప్పలేదు. కాళ్లూ చేతులతో పాటు ముఖం ఉబ్బిన కారణంగా అన్నయ్యను హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాం. ఆ ఒక్క లక్షణంతోనే సిర్రోసిస్‌ అని అనుమానించడం ఎంత వరకు కరెక్ట్‌? ఆ వివరాలు తెలియచేయండి.
                                                                                                                                                                                                                  - డి. ఉపేంద్ర, మెదక్‌
 
లక్షణాల్లో....
సిర్రోసిస్‌ వ్యాధి ప్రారంభమైన చాన్నాళ్ల దాకా ఏ లక్షణాలూ కనిపించవు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా లక్షణాలు బయటపడతాయి.
ఒంటి రంగు పాలిపోవడం, శరీరం శక్తిహీనంగా మారిపోవడం, రక్తహీనత ఉంటాయి.
ఆకలి మందగించడం, బరువు తగ్గడం.
పాదాలు, వేళ్లల్లో, తిమ్మిరెక్కుతున్నట్లు చురుక్కుమని మంటలు రావడం.
కాళ్లూ చేతులతో పాటు ముఖం ఉబ్బడం.
కడుపులో నీరు చేరి ఉబ్బరంగా అనిపించడం
వృషణాలు కుంచించుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఆల్కహాలు మూలంగా వచ్చిన సిర్రోసిస్‌ అయితే తాగుడు మానుకోగానే ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత రెండేళ్ల దాకా ఏ దుష్ప్రభావాలూ లేకపోతే అతడు తిరిగి తన ఆరోగ్య స్థితికి చేరుకుంటాడు. ఒకవేళ అప్పటికీ తాగుడు మానుకోకపోతే ప్రాణాపాయ స్థితికి చేరుకుకుంటాడు. ఏమైనా మీ అన్నయ్యకు ఒకవేళ సిర్రోసిస్‌ సమస్యే ఉన్నా, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉంటే ఆల్కహాలు మానేసి సరియైున వైద్య చికిత్సలు తీసుకుంటే అతడు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి.
                                                                                                                                                                  - డాక్టర్‌ ఎన్‌. ప్రకాశ్‌ రావు, గ్యాపో్ట్ర ఎంటరాలజిస్ట్‌