కడుపులో మంటగా ఉంది

12-05-2018: కొన్ని నెలలుగా కడుపులో మంటతో బాధపడుతున్నాను. అదెలా తగ్గుతుంది? ఏ ఆహారం తింటే మంచిది? ఏవి తినకూడదు?

-సునీత
 
దీనినే ఇన్‌ఫ్లమేషన్‌ లేదా గ్యాస్ట్రైటిస్‌ అంటారు. యాస్ర్పిన్‌, నొప్పిబిళ్లల వంటివి ఎక్కువగా వాడడం వల్ల పొట్టలో గోడలు, పొర దెబ్బతింటాయి. ఖాళీ కడుపుతో కాఫీ, టీలు, నిమ్మరసం తాగినా, వేడి పదార్థాలు తిన్నా ఈ సమస్య తలెత్తుతుంది. క్రానిక్‌ అల్సర్లు వస్తాయి. రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువైనా తీవ్ర గ్యాస్ట్రైటిస్‌ సమస్య తలెత్తుతుంది. దీంతో బాధపడేవారికి ఆకలి ఉండదు. బ్రేక్‌ఫాస్ట్‌ చేయరు. వాంతులు అవుతాయి.
 
ఉదయమే ఖాళీ కడుపుతో గోరువెచ్చటి నీళ్లల్లో రెండు టేబుల్‌స్పూన్ల తేనె వేసుకుని తాగితే ఎసిడిటీ తగ్గుతుంది. 
పొట్టశుభ్రం కావడానికి పావు టీస్పూను నల్లజీలకర్ర తినాలి. తేనెతో కలిపిన ఓట్స్‌ను బ్రేక్‌ఫా్‌స్టలో తిన్నా ఫలితం ఉంటుంది.
బొప్పాయి గింజల పొడిని, పైనాపిల్‌ ముక్కలపై చల్లుకుని రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపున తింటే సాంత్వన లభిస్తుంది.
ఆకుపచ్చని యాలకులు, సోంపు గింజలు, దాల్చినచెక్కలను సమపాళ్లలో తీసుకుని పాన్‌లో నూనె లేకుండా 30సెకన్లు వేగించి మెత్తటి పొడిలా చేయాలి. ఈ పొడిని భోజనంతో పాటు అరటీస్పూను తినాలి.
అల్లం, ఉల్లిపాయలు సమంగా తీసుకుని జ్యూసులా చేసి రోజూ రెండుసార్లు తాగాలి.
పెరుగు, క్యారెట్‌ జ్యూసు, కొబ్బరినీళ్లు, తేనె, తాజా పళ్లు, కాయగూరలు, ఆకుకూరలు, తక్కువ ఫ్యాట్‌ ఉన్న పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
బీన్స్‌, కాఫీ, టీ, నిమ్మ, ఆరెంజ్‌ జ్యూసు, మసాలా వంటకాలు, ఆల్కహాల్‌, మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి.