ఎసిడిటీ బాధిస్తుంటే..

23-5-2017: ఎసిడిటీ సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. పొట్టలో ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఎసిడిటీ సమస్య ఉత్పన్నమవుతుంది. మసాలా పదార్థాలు, వేపుళ్లు ఎక్కువగా తిన్నప్పుడు ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.

కెఫిన్‌ వంటి పానీయాలను దూరంగా ఉండాలి. హెర్బల్‌ టీ తాగొచ్చు.
ప్రతిరోజు ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
రోజూ అరటిపండు, వాటర్‌మెలన్‌, కీరదోస వంటి వాటిని తినాలి. వాటర్‌మెలన్‌ జ్యూస్‌ ఎసిడిటీ నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది.
ఒకవేళ ఎసిడిటీ సమస్య తీవ్రంగా ఉంటే కొబ్బరి నీరు తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.
ప్రతిరోజు గ్లాసు పాలు తీసుకోవాలి.
భోజనానికి, భోజనానికి మధ్య ఎక్కువ సమయం గ్యాప్‌ ఉండటం ఎసిడిటీకి కారణమవుతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు భోజనం చేయండి.
చట్నీలు, వెనిగర్‌ వంటి వాటికి దూరంగా ఉండండి.
కొన్ని పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి భోజనం తరువాత ఆ నీటిని తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
నిమ్మ, అరటిపండు, బాదం, పెరుగు కూడా ఎసిడిటీ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి.
స్మోకింగ్‌, ఆల్కహాల్‌ వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
చూయింగ్‌ గమ్‌ నమలడం వల్ల ఈసియోఫేగస్‌ నుంచి ఆహారం కదిలి హార్ట్‌బర్న్‌ వంటి లక్షణాలు తగ్గిపోతాయి.
లంచ్‌కు ముందు కొద్దిగా పంచదార కలిపిన ఒక గ్లాసు నిమ్మరసాన్ని తీసుకుంటే ఎసిడిటీకి సంబంధించిన అసౌకర్యం తగ్గిపోతుంది.
క్యారెట్‌, బీన్స్‌, గుమ్మడి, క్యాబేజీ, మునగకాయలు వంటి కూరగాయలు తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
 
ధ్యానం ఎందుకు?
రోజూ ధ్యానం ఎందుకు చేయాలి? అంటే ధ్యానంతో చాలా రకాల ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
రోజూ ధ్యానం చేయడం వల్ల ఆలోచనా స్థాయి, అవగాహన శక్తి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో మరింత సమర్ధంగా పనిచేస్తారు.
ధ్యానం తాలూకు ఫలితాలు మీ ఆలోచనల్లో కనిపిస్తాయి. మీ మనస్సు గడిచిన కాలంపైకి, భవిష్యత్తుపైకి వెళ్లకుండా ప్రస్తుత కాలంపై దృష్టి నిలుపుతుంది. దానివల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
మీలోని అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది. ఎక్కువ ఒత్తిడి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. దీన్ని ఎదుర్కో వాలంటే ధ్యానం తప్పనిసరి. శ్వాసను ధీర్ఘంగా తీసుకోవడం, వదలడం చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది.
భావోద్వేగాలపై నియంత్రణ వస్తుంది. సంతోషాన్ని అందరూ వ్యక్తపరుస్తారు. కోపం, బాధ, విషాదం వంటి భావోద్వేగాలను వ్యక్తపరిచే సమయంలోనూ నియంత్రణ ఉండాలంటే ధ్యానంతోనే సాధ్యమవుతుంది.
మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వస్తుంది. నిర్ణయం తీసుకునే ముందు దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించే శక్తి, విశ్లేషించుకునే సామర్థ్యం పెరుగుతాయి.
ధ్యానం ద్వారా కొత్త స్కిల్స్‌ నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఽఇతర నైపుణ్యాల మాదిరిగానే ధ్యానం ఒక నైపుణ్యమే. ప్రాక్టీస్‌, ఏకాగ్రతతో ఇది పెరుగుతుంది. జీవితంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది.
ధ్యానం చేయడానికి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు ప్రయత్నించకూడదు.
ధ్యానం చేయడానికి ప్రశాంతంగా ఉండే స్థలం ఉంటే చాలు. ఇంట్లోనూ, ఆఫీ్‌సలోనూ చేయొచ్చు. గుడి, చర్చ్‌ వంటి ప్రార్థనా మందిరాల్లోనూ చేయవచ్చు. పార్క్‌ వంటి ఆరుబయట ప్రదేశాల్లో చేసినా ఉత్తమంగా ఉంటుంది.
దీర్ఘకాలం పాటు ధ్యానం చేసినపుడు కలిగే ప్రయోజనాలు అనేకం అని సైన్స్‌ కూడా చెబుతోంది. శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతమయి ఆరోగ్యవంతమైన జీవితం గడిపే అవకాశం లభిస్తుంది. ఇంకెందుకాలస్యం... ప్రతిరోజూ పావుగంట ధ్యానం కోసం కేటాయించండి.