ఈ ఛాతీ మంట తగ్గదేమిటి?

20-09-2017: నా వయసు 36. గత రెండు నెలలుగా నాకు ఛాతీలో మంటగా ఉంటోంది. అన్నం తిన్నాక వెల్లకిలా పడుకున్నా, ముందుకు వంగినా ఈ మంట మరికాస్త ఎక్కువవుతోంది. ఈ సమస్యకు గల కారణమేమిటి? దీన్నించి బయటపడే మార్గం ఏమిటి? కాస్త వివరంగా చెప్పండి.
                                                                                                                                                                                                    - హెచ్‌. ప్రవీణ్‌, ఆదిలాబాద్‌
 
మీకున్న సమస్యను ‘రిఫ్లక్స్‌ ఈసోఫైగస్‌’ అంటారు. జీర్ణాశయంలోని రసాలు అన్న వాహికలోకి, ఇంకా పైకి రావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఉన్న వారికి, జీర్ణాశయం పై భాగాన, లేదా ఛాతీలో మంటగా అనిపిస్తుంది..
సాధారణంగా, ఏదైనా మింగినప్పుడు ఈ లక్షణాలు తాత్కాలికంగా వచ్చి, ఆ తర్వాత పోతాయి. కొందరిలో మాత్రం ఈ లక్షణాలు నెలలే కాదు ఏళ్ల తరబడి అలా కొనసాగుతూనే ఉంటాయి.
ఒక్కోసారి ఛాతీకి, పొత్తి కడుపుకూ మధ్య జీర్ణాశయం అటూ ఇటూ జారుతూ, ‘హయాటస్‌ హెర్నియా’ ఏర్పడుతుంది. దీనివల్ల అన్నవాహిక అడుగు భాగం మరింత బలహీన పడుతుంది. ఇది కూడా ఛాతీ మంటకు కారణమవుతుంది.
చాలా అరుదుగానే అయినా జీర్ణాశయంలోని కొంత భాగానికి శస్త్ర జరిగినప్పుడు జీర్ణాశయంలోని ఇతర రసాలు అన్నవాహిక లోకి ఎగతన్నుకు వచ్చి ఛాతీ మంటకు కారణమవుతాయి. అయితే ఈ సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి రక్తస్రావం లేదా రక్త వాంతులూ కావచ్చు.
కొన్ని జాగ్రత్తలు
ఈ సమస్య ఉన్నవారు ఎక్కువ మోతాదులో అన్నం తినకుండా, మితంగా ఎక్కువ సార్లు తీసుకోవడం మేలు. స్థూలకాయం ఉంటే వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
పడుకునే సమయంలో తలవైపు 5 అంగుళాలు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి.
ఛాతీలో మంటగా ఉండి, సమస్య రోజురోజుకూ తీవ్రమవుతూ ఉన్నా చికిత్స తీసుకోకపోతే, ఒక దశలో అన్నవాహిక ముడుచుకుపోయి మరికొన్ని తీవ్రమైన ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఛాతీ మంట మరీ ఇబ్బందికరంగా మారినప్పుడు, రక్తపు వాంతులు అవుతున్నప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.
డాక్టర్‌ బి. వేణుగోపాల్‌, కన్సల్టెంట్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు